SIT Searches : రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు
హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దాడుల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొంటున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కాంపై సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.
- By Latha Suma Published Date - 06:48 PM, Mon - 14 April 25

SIT Searches : వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ బృందం సోదాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దాడుల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొంటున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కాంపై సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ముందస్తు బెయిల్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించినా విచారణకు హాజరు కావడం లేదు.
Read Also: Classmate All Rounder : సమగ్ర విద్య లక్ష్యంకు తోడ్పాటు అందిస్తున్న క్లాస్‌మేట్ ఆల్ రౌండర్
ఈ కేసులో ఇప్పటివరకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన బేఖాతరు చేశారు. విచారణకు రాకుండా పరారయ్యారు. మద్యం కేసులో విచారణకు హాజరుకావాలంటూ మార్చి 28, 29వ తేదీల్లో వరుసగా రెండుసార్లు సిట్ నోటీసులిచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారుల బృందం.. హైదరాబాద్‌లోని కసిరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా రాజ్ కసిరెడ్డిని విచారిస్తే స్కామ్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖలోని పోలీసుల ప్రమేయంపైనా సిట్ దర్యాప్తు చేస్తోంది.
కాగా, ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులిచ్చారో చెప్పాలంటూ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ నోటీసుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యేందుకు రాజ్ కసిరెడ్డికి తగినంత సమయమిస్తూ ఏప్రిల్ 9న విచారణకు రావాలంటూ ఏప్రిల్ 5న సిట్ అధికారులు మూడోసారి నోటీసులిచ్చారు. ఈసారి కూడా ఆయన విచారణకు రాలేదు. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేసి పరారైపోయారు.
Read Also: BR Ambedkar’s 134th Birth Anniversary : మంచిర్యాల జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు