జగన్ కు ఉద్యోగుల అల్టిమేటమ్
కోవిడ్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకుండా ఫుల్ సాలరీ తీసుకున్నారు. కొందరు మాత్రమే కోవిడ్ విధులను నిర్వహించారు.
- By CS Rao Published Date - 04:26 PM, Wed - 1 December 21

కోవిడ్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకుండా ఫుల్ సాలరీ తీసుకున్నారు. కొందరు మాత్రమే కోవిడ్ విధులను నిర్వహించారు. సమాజం కోవిడ్ ఇబ్బందుల్లో ఉందని ఏ ఒక్కరూ జీతంలో కొంత భాగాన్నైనా తిరిగి ఇవ్వలేదు. పైగా ఇప్పుడు 11వ పీఆర్సీ కోసం ఏపీ సీఎం జగన్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగుల వాలకం సామాన్యులకు యావగింపు కలిగిస్తోంది.రాష్ట్ర విడిపోయినప్పుడు అప్పులతో ఏపీ ప్రభుత్వం మొదలైయింది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణతో పోటీ పడి జీతాలను పెంచే వరకు చంద్రబాబు మీద ఆనాడు ఒత్తిడి తెచ్చి నెగ్గారు. ఉద్యోగులకు ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వంత పాడాడు. వాళ్ల అడుగులకు మడుగులొత్తాడు. పదవీ విరమణ చేసిన వాళ్లకు ఎమ్మెల్సీ పదవులను కూడా ఇచ్చాడు. ఆ స్థాయిలో వాళ్లను నెత్తిన ఎక్కించుకున్నాడు.
హైద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చాడు. అక్కడ ఉండేందుకు వసతి, తినడానికి తిండిని కూడా ఉద్యోగులు అడిగారు. అంతేకాదు, డబుల్ హెచ్ ఆర్ ఏ వసూలు చేశారు. అయినప్పటికీ రెండంకెల స్థాయికి అవినీతి చేరింది. ఆ విషయాన్ని చంద్రబాబే ఆనాడు రివ్యూ మీటింగ్‌ల్లో వెల్లడించాడు.కోవిడ్ వెంటాడుతున్న ప్రస్తుత సమయంలో సామాన్యుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ల మీద భారం మోపి పీఆర్సీని పెంచుకోవాలని ఉద్యోగులు చూడడం విచిత్రం. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏపీలో ఉంది. ఆ విషయాన్ని ఆర్థిక నిపుణులతో పాటు ఉద్యోగులు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించి పీఆర్సీని పెంచుకోవాలని చూడడం దారుణం. హక్కుల కోసం పోరాడుతోన్న ఉద్యోగులు ఎక్కువ మంది ఏనాడూ బాధ్యతల గురించి ఆలోచించలేదు. అవినీతిని పరాకాష్టకు చేర్చారు. దాని నియంత్రణ కోసం 14400 నెంబర్ ను సీఎం జగన్ పరిచయం చేశాడు.
ఉద్యోగుల వాలకాన్ని అవగాహన చేసుకున్న సీఎం జగన్ మాత్రం ఆనాడు చంద్రబాబులాగా మెడలు వంచడానికి సిద్ధంగా లేడు. పీఆర్సీ ఇవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని చెప్పడానికి సిద్ధం అవుతున్నాడు. ఒక వేళ వాళ్లకు పీఆర్సీ ఇస్తే వెంటనే ఆ భారాన్ని ఏదో ఒక రూపంలో ప్రజల మీద మోపాలి. ఇప్పటికే భారంగా జీవితాన్ని నెట్టుకొస్తోన్న పేదల గురించి జగన్ ఆలోచిస్తున్నాడట. అందుకే ఉద్యోగులు సమ్మె చేసినప్పటికీ వాళ్లతో సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఉద్యమ కార్యాచరణకు బ్లూ ప్రింట్ రచించిన ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచణ నోటీసు అందించారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలైన బొప్పరాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్ ను అందచేయడం వెనుక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు అమలు చేయబోతున్నాయి. న్యాయపరమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు వివిధ రూపాల్లో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధం అయ్యారు. ప్రధాన డిమాండ్లలో 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపులు..ఇలా చాలా గొంతమ్మె కోర్కెలను జగన్ సర్కార్ ముందుంచాయి. వాళ్ల బెదిరింపులకు ఇప్పటి వరకు భయపడని జగన్ ఈసారి మెడ వంచుతాడా? లేక మరో రూపంలో ఉద్యోగుల పని పడతాడా? చూడాలి.