Weather Update: బండలు పగిలే ఎండలు.. రెడ్ అలర్ట్
- Author : Vamsi Chowdary Korata
Date : 20-05-2026 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ రోజు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లొద్దంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక.. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ రోజు 71 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 20, శ్రీకాకుళం జిల్లాలో 18, కాకినాడ జిల్లాలో 9, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 6, పోలవరం జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలోని 4 మండలాలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 277 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఎండలతో పాటుగా వేడిగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది వచ్చే ఆదివారం వరకు కొనసాగుతాయని అంటున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎండల సంగతి అలా ఉంటే, రాయలసీమ, దక్షిణ కోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన జనాలకు మళ్లీ ఎండల తీవ్రత మొదలైంది. ఉక్కపోత, వేడిగాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.