Land registration Value Increase : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు..
గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపారు. అయితే అమరావతి రాజధాని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచన లేదన్నారు.
- By Latha Suma Published Date - 03:37 PM, Mon - 27 January 25

Land registration Value Increase : ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచనున్నట్లు తెలిపారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపారు. అయితే అమరావతి రాజధాని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచన లేదన్నారు. అక్కడి పరిసర గ్రామాలకు ఈ ఛార్జీల పెంపును మినహాయించనున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదల కు సంబంధించి త్వరలో సమావేశం ఉంటుందన్నారు. వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. రెవెన్యూ సదస్సులో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. అధికారులు పై చర్యలు ఉంటాయని అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
కాగా, గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకోంటోందని, అయితే రాష్ట్రానికి రెవెన్యూ కూడా అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. జగన్ రెడ్డి తన స్వార్ధం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా ఇబ్బందులు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పారు. భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా 11 వేల ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఇలా పరిష్కరించిన సమస్యలను ముందుగానే ఎందుకు చేపట్టలేదంటూ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.