RGV Video : నాపై కక్ష సాధింపు.. అప్పటి కామెంట్స్‌కు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా ? : ఆర్జీవీ
ఇప్పుడు నా(RGV Video) విషయంలో అదే జరుగుతోందేమో అనిపిస్తోంది’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.
- By Pasha Published Date - 09:13 AM, Wed - 27 November 24

RGV Video : ఏపీలో తనపై పెట్టిన పోలీసు కేసులకు భయపడటం లేదని డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. తాను ఎవరిపై అయితే కామెంట్స్ చేశానో .. వారికి కాకుండా వేరొకరికి మనోభావాలు దెబ్బతినడం విడ్డూరంగా ఉందన్నారు. తాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఏడాది తర్వాత.. ఇప్పుడు నాలుగు వేర్వేరు చోట్ల నలుగురు వ్యక్తులకు మనోభావాలు దెబ్బతినడం అనేది ఆలోచించాల్సిన విషయమని రాంగోపాల్‌వర్మ చెప్పారు. ‘‘నేను కామెంట్స్ చేసిన వారికి కాకుండా ఇతరులకు మనోభావాలు దెబ్బతింటే కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి ?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నందున, నిర్మాతకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో పోలీసు విచారణకు హాజరు కాలేదని ఆర్జీవీ తెలిపారు. ‘‘అమెరికా, ఐరోపా దేశాలలో పోలీసు వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుతున్నారు.. మనదేశంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు నా(RGV Video) విషయంలో అదే జరుగుతోందేమో అనిపిస్తోంది’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈమేరకు రాంగోపాల్‌వర్మ తన యూట్యూబ్ అకౌంటులో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
Also Read :Heart Attack: ఎక్కువసేపు నీళ్లు తాగకుండా ఉంటే గుండెపోటు వస్తుందా?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు ‘వ్యూహం’ సినిమా విడుదలైంది. ఆ మూవీ ప్రమోషన్‌లో భాగంగా సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు, పవన్‌లపై చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఏపీలో పలుచోట్ల ఇటీవలే కేసులు నమోదయ్యాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు తొలి కేసు నమోదు చేశారు. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో ఇటీవలే అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆర్జీవీ ఇంట్లో లేరని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ వీడియోను విడుదల చేయడం గమనార్హం.