Prashant Kishore : బీజేపీకి సీట్లు అస్సలు తగ్గవు.. జగన్‌కు ఓటమి ఖాయం : పీకే
లోక్‌సభ పోల్స్ ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 03:59 PM, Tue - 21 May 24

Prashant Kishore : లోక్‌సభ పోల్స్ ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని మరోసారి ప్రధాని మోడీ గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మోడీ, అమిత్‌షా చెబుతున్నట్లుగా బీజేపీకి ఈసారి 370కి మించి లోక్‌సభ సీట్లు దాటకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లే వస్తాయన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ, బీజేపీలపై అసంతృప్తి మాత్రమే ఉందని.. ఆగ్రహం లేదని పీకే అభిప్రాయపడ్డారు. అందుకే ఈసారి బీజేపీ 2019 నాటికి సరి సమానమైన లోక్‌సభ సీట్లను కానీ అంతకంటే ఎక్కువ సీట్లను కానీ గెల్చుకునే ఛాన్స్ ఉంటుందని ఆయన వివరించారు. ‘‘ఉత్తర, పశ్చిమ భారత్‌లో దాదాపు 325 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీకి 2014 సంవత్సరం నుంచే బలమైన పట్టు ఉంది. తూర్పు, దక్షిణాదిన బీజేపీకి బలం తక్కువ. గెలుపుపై ప్రభావం ఉంటే ఉత్తరం, పశ్చిమ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ, ఈసారి తూర్పు, దక్షిణాదిన ఓట్లతో పాటు సీట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లోనూ బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలు చాలా తక్కువ’’ పీకే (Prashant Kishore) తనదైన శైలిలో విశ్లేషించారు.
We’re now on WhatsApp. Click to Join
మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం తప్పదని ఆయన అంచనా వేశారు. ‘‘ఎన్నికల్లో గెలవబోతున్నామని సీఎం జగన్ చెబుతున్నట్లుగానే అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా చెబుతున్నారు. నేను గత పదేళ్లుగా ఎన్నికల్లో పనిచేస్తున్నాను. ఫలితాల కంటే ముందే ఓటమిని అంగీకరించినవారు ఇప్పటివరకు నాకు ఎవరూ కనిపించలేదు’’ అని పీకే కామెంట్ చేశారు.
Also Read :BORG Drinking : బోర్గ్ డ్రింకింగ్ ట్రెండ్.. మత్తు ఉచ్చులో యువత
‘‘జూన్ 4న ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా కచ్చితంగా చూడండి.. వచ్చే రౌండ్లలో తమకు మెజార్టీ ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చాలామంది ధీమా వ్యక్తం చేస్తారు’’ అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాము ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. జగన్ మాత్రం అలా కాకుండా గత ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని అంటున్నారు’’ అని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే దాకా గెలుపు ఓటములపై చర్చకు అంతమే ఉండదని పీకే చెప్పారు.