Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీలో కొందరు టాలీవుడ్ నటులు పాల్గొన్నారా ? లేదా ? అంటే.. పాల్గొన్నారని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ పేర్కొన్నారు.
- By Pasha Published Date - 02:17 PM, Tue - 21 May 24

Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో కొందరు టాలీవుడ్ నటులు పాల్గొన్నారా ? లేదా ? అంటే.. పాల్గొన్నారని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ పేర్కొన్నారు. ‘సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ’ పేరుతో బెంగళూరు నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. హేమ సోమవారం రోజు విడుదల చేసిన వీడియోను ఎక్కడ షూట్ చేశారనే దానిపై తాము విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆ రేవ్ పార్టీలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజుగా రూ.50 లక్షలు వసూలు చేశారని.. అంత భారీ ఫీజు కట్టి 100 మంది పాల్గొన్నారని దయానంద్ తెలిపారు. ఈ పార్టీలో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొనలేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు.
We’re now on WhatsApp. Click to Join
కలకలం రేపిన రేవ్ పార్టీ వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ.. ఈ పార్టీలో కోట్ల రూపాయల విలువైన కొకైన్, గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రాన్ని డ్రగ్స్‌ఫ్రీగా మార్చాలని తాము చేస్తున్న ప్రయత్నాలు ఇతర రాష్ట్రాల డ్రగ్స్ పెడ్లర్ల వల్ల విఫలమవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. బెంగళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదంటూ నటి హేమ సోమవారం ఉదయం ఓ వీడియో విడుదల చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తనపై వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరారు.
Also Read :Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు..!
నటుడు శ్రీకాంత్ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన కూడా స్పందించి.. తాను ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి చూడడానికి తనలాగానే ఉన్నాడని, దాన్ని చూసి తాను కూడా షాక్ అయ్యినట్లు నటుడు శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో కనిపించేది తాను కాదని తేల్చి చెప్పారు.ఆ వార్తలను నమ్మొద్దని కోరారు. రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని తాను కాదని చెప్పారు.