PM Modi: సీఎం చంద్రబాబుపై ప్రధాని మోడీ ప్రశంసలు..!
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏపీ ప్రజలతో కలిసి పాల్గొంటానని మోడీ ప్రకటించారు. భారత యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, రాబోయే 50 రోజుల్లో ఏపీలో యోగా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
- By Gopichand Published Date - 06:13 PM, Fri - 2 May 25

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అమరావతిలో తెలుగులో ప్రసంగించారు. దుర్గా భవానీ కొలువైన ఈ పుణ్యభూమిలో ప్రజలను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. అమరావతిపై నిలబడి, ఒక స్వప్నం సాకారం అవుతున్న దృశ్యం కనిపిస్తోందని అన్నారు. రూ.60 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిందని తెలిపారు. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు, ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనాలని వివరించారు. ఈ విజయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపారు.
మోడీ.. ఏపీకి గతంతో పోలిస్తే 10 రెట్లు అధిక నిధులు కేటాయించామని, ముఖ్యంగా రైల్వే అభివృద్ధికి గతంలో ఏపీ, తెలంగాణకు కలిపి రూ.900 కోట్ల బడ్జెట్ ఉండగా, ఇప్పుడు ఒక్క ఏపీకే రూ.9 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. ఈ రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని పెంచి, తీర్థయాత్రలు, పర్యాటకాభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. కనెక్టివిటీలో ఏపీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోందని ఉద్ఘాటించారు.
Also Read: Amaravati Relaunch : వేదికపై పవన్ కళ్యాణ్ కు మోడీ ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏపీ ప్రజలతో కలిసి పాల్గొంటానని మోడీ ప్రకటించారు. భారత యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, రాబోయే 50 రోజుల్లో ఏపీలో యోగా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు. ప్రపంచ రికార్డు సృష్టించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అమరావతి అభివృద్ధితో ఏపీ దశ, దిశ మారుతుందని మోడీ ఉద్ఘాటించారు. ఏపీలో కలలు కనేవారితో పాటు, వాటిని సాకారం చేసేవారు ఎక్కువగా ఉన్నారని ప్రశంసించారు. చంద్రబాబు మూడేళ్లలో అమరావతిని పూర్తి చేయాలని సంకల్పించారని, ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఈ వేగం కొనసాగాలని కోరారు. “భారత్ మాతాకీ జై, వందేమాతరం” నినాదంతో ప్రసంగాన్ని ముగించారు.