YS Jagan : పరామర్శకు వచ్చి జేజేలా? జగన్ పై పరిటాల సునీత ఫైర్
YS Jagan : “పరామర్శకు వచ్చారా.. ఎన్నికల ప్రచారానికా?” అంటూ మండిపడ్డ సునీత, చావు ఇంటికి వచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేయడం అమానుషమని వ్యాఖ్యానించారు
- Author : Sudheer
Date : 08-04-2025 - 5:01 IST
Published By : Hashtagu Telugu Desk
రాప్తాడు (Raptadu ) నియోజకవర్గంలో జరిగిన హత్య ఘటన నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పర్యటనపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర స్థాయిలో స్పందించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చారంటూ ఆమె ఆరోపించారు. “పరామర్శకు వచ్చారా.. ఎన్నికల ప్రచారానికా?” అంటూ మండిపడ్డ సునీత, చావు ఇంటికి వచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేయడం అమానుషమని వ్యాఖ్యానించారు. తనను మరియు తన కుమారుడిని లక్ష్యంగా చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.
Pawan Kalyan’s Son Injured : పవన్ కొడుకు కోసం జగన్ ప్రార్థనలు..మార్పు వచ్చిందా..?
జగన్ చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివినట్టు ఉందని ఆమె ఎద్దేవా చేశారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనను గాలికొచ్చిన ఆరోపణలతో తారుమారు చేస్తున్నారని, గ్రామాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌కు నిజమైన బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే, తన స్వంత చెల్లెళ్లకు న్యాయం చేసేవాడు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తన భర్త పరిటాల రవిని గతంలో జగన్ అడ్డుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు తన కుమారుడిపై వ్యూహాత్మకంగా రాజకీయ దాడికి దిగారని విమర్శించారు.
పోలీసుల వ్యవహారంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. “ఎస్ఐను తిట్టడం, పోలీసులపై బెదిరింపులు చేయడం బాధాకరం. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు అంటూ సవాలు విసిరిన సునీత, తాము భగవద్గీత మీద ప్రమాణం చేస్తామని చెప్పారు. పోలీసులు ఇప్పటికైనా స్పందించాలి, జగన్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. చివరగా ఎంపీపీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ నాయకుడి మాటలు నమ్మి జగన్ ఇంత దూరం వచ్చారని విమర్శించారు. జగన్ పర్యటన ముగిశాక, హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డు మార్గంలో బెంగుళూరు వెళ్లారు.