Assembly meetings : ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల
ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని.. 30లక్షల మందికి అందజేశామని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు.
- Author : Latha Suma
Date : 18-11-2024 - 5:05 IST
Published By : Hashtagu Telugu Desk
Nadendla Manohar : నేడు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సోమవారం తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. దీంతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ పదేపదే ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ..రాష్ట్రంలోని టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ అందజేస్తామన్నారు. ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని.. 30లక్షల మందికి అందజేశామని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు. మార్చి 31, 2025 వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీనికోసం పూర్తి నిధులు కేటాయించామని.. ఎవరికీ అనుమానాలు అవసరం లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు.
మరోవైపు హెల్త్ యూనివర్సిటీ కి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించింది. అంతేకాదు.. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. వైద్య వృత్తి సవరణ బిల్లు, వ్యవసాయ సహకార సంఘాల సవరణ బిల్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లలకు ఆమోదం అసెంబ్లీలో ఆమోదం లభించింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తూ స్వీకర్ అయ్యన్న ప్రకటన చేశారు.