Onion Prices : ఉల్లి ధరల మంట.. ఉత్తరాదిలో కిలో రూ.100.. తెలుగు రాష్ట్రాల్లోనూ పైపైకి
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుతానికి ఉల్లి ధరలు(Onion Prices) కొంత కంట్రోల్‌లోనే ఉన్నాయి.
- By Pasha Published Date - 10:30 AM, Mon - 11 November 24
Onion Prices : ఉల్లి ధరల మంట తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలను అల్లాడిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.80 దాటింది. రిటైల్ షాపుల్లోనైతే రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. పలుచోట్ల కిలో ఉల్లిని రూ.100 దాకా అమ్ముతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుతానికి ఉల్లి ధరలు(Onion Prices) కొంత కంట్రోల్‌లోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కేజీకి రూ.50 నుంచి రూ.60 వరకు ధర ఉంది. వచ్చే వారం రోజుల్లో ఈ రేట్లు కేజీకి రూ.70 నుంచి రూ.80 రేంజుకు చేరుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
Also Read :MNJ Cancer Hospital : ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఏఐ థెరపీ యంత్రం.. రూ.లక్షల చికిత్స ఫ్రీ
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఉల్లి దిగుబడి తగ్గింది. మనదేశంలో అత్యధికంగా ఉల్లి సాగు జరిగేది మహారాష్ట్రలో. అయితే అక్కడ అకాల వర్షాలతో పంట దెబ్బతింది. ఫలితంగా అక్కడి ఉల్లి మార్కెట్లకు కూడా సరుకు రాక తగ్గిపోయింది. ఈ పరిణామాలతో మన కర్నూలులో, మహారాష్ట్రలో ఉన్న ఉల్లి మార్కెట్లలో ధరలను అమాంతం పెంచేశారు. డిమాండ్ ఎక్కువగా సప్లై తక్కువగా ఉండటం వల్ల ఉల్లి ధరలు పెరిగిపోయాయి.
Also Read :Trump Vs Putin : పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని సూచన
కర్నూలు మార్కెట్‌లో మొదటి గ్రేడ్ ఉల్లి క్వింటాలుకు రూ.4888 దాకా ధర పలుకుతోంది. మీడియం సైజు ఉల్లి ధర క్వింటాలుకు రూ.3919 దాకా పలుకుతోంది. ఈ పరిణామం రైతులకు సంతోషాన్ని అందిస్తుండగా.. వినియోగదారులకు ఆందోళనను మిగులుస్తోంది. ఉల్లి ధరలు పెరగడంతో హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు దాని వినియోగాన్ని తగ్గించారు. మరోవైపు వెల్లుల్లి ధరలు కూడా రెట్టింపయ్యాయి. దీంతో తమ నెలవారీ కుటుంబ బడ్జెట్ కుదుపునకు గురవుతోందని కొనుగోలుదారులు వాపోతున్నారు.