Onion Prices: ఉల్లి ధరలు ఢమాల్.. కిలో ధర ఎంతంటే?
కర్నూలు ఉల్లికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
- By Gopichand Published Date - 02:58 PM, Wed - 1 October 25

Onion Prices: దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన కర్నూలు ఉల్లికి ఈ ఏడాది గిట్టుబాటు ధర లేకపోవడంతో జిల్లా ఉల్లి రైతులు (Onion Prices) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పంట పెట్టుబడులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు ఆగ్రహంతో తాము పండించిన పంటను పొలాల్లోనే దున్నేయడం, పశువులకు మేతగా వేయడం లేదా వంకల్లో పారబోయడం వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రూ. 2 లక్షల పెట్టుబడికి రాబడి సున్నా
తాజా ఘటనలో ఆస్పరి మండలం యాటకల్లు గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆయన రెండు ఎకరాలలో ఉల్లి పంట సాగు చేసేందుకు సుమారు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే మార్కెట్లో కనీస మద్దతు ధర లభించకపోవడంతో పండించిన ఉల్లిని ఏం చేయాలో తెలియక వంకలో పారబోశారు. పొలంలో నుంచి పడేస్తున్న ఉల్లి బస్తాల కోసం స్థానిక ప్రజలు బారులు తీరిన దృశ్యం రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. పండించిన రైతుకు ఆదాయం లేక పంట వృథా చేస్తుంటే.. ఆ ఉల్లి కోసం ప్రజలు పోటీ పడడం ఈ వ్యవస్థలోని వైరుధ్యాన్ని స్పష్టం చేస్తోంది.
Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మ సంచలనం.. ICC T20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ రికార్డు!
రద్దు చేసిన మద్దతు ధరపై రైతుల ఆవేదన
గతంలో ఉల్లికి ప్రభుత్వం అందించిన రూ. 1200 మద్దతు ధరను రద్దు చేయడం రైతుల ఆందోళనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం రూ. 1200 మద్దతు ధర రద్దు చేసి హెక్టార్‌కు రూ. 50 వేల మద్దతు కల్పిస్తున్నప్పటికీ అది తమ పెట్టుబడులు, కూలీ ఖర్చులకు ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక పోవడంతో ప్రతి ఏటా ఉల్లి రైతులు కంటతడి పెడుతున్నారు. పెట్టుబడి ఖర్చులు, కూలీలు భారంగా మారడంతో వారు పంటను పొలాల్లో దున్నివేయడం లేదా వంకల్లో పడేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మహారాష్ట్ర ఉల్లి కట్టడిపై డిమాండ్
కర్నూలు ఉల్లికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌ను ముంచెత్తుతున్న మహారాష్ట్ర ఉల్లిని కట్టడి చేసి స్థానిక కర్నూలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఉల్లి రైతుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కితేనే వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుందని, లేకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి సాగు మరింత తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు