YCP : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట.. కారణం ఇదేనట..!
ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ
- By Prasad Published Date - 09:05 AM, Wed - 25 January 23

ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు.. సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఒకానొక స్టేజిలో ఇద్దరు గల్లాలు పట్టకునే వరకు వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత.. దమ్ముంటే నా నియోజకవర్గంలో అడుగు పెట్టు అంటూ పరస్పరం సవాళ్లు చేసుకునే పరిస్థితికి వెళ్లింది. విజయవాడ కేంద్రంగా ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతుంది.
విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాల్గొన్నారు. భవకుమార్ తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేసారు. విందులో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్న సమయంలో తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌ను తనకు చెప్పకుండా సీఎం వద్దకు తీసుకెళ్లడంపై ఉదయభానును మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. దీనికి స్పందించిన సామినేని తనకు కాంగ్రెస్‌లో ఉన్న సమయం నుంచి శ్రీనివాస్‌తో సంబంధాలు ఉన్నాయని తీసుకెళ్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తన నియోజకవర్గంలో సామినేని జోక్యం చేసుకోవటంపై వెల్లంపల్లి నిలదీసారు.
విజయవాడ నీ సొత్తా.. నీకేమైనా రాసిచ్చారా అంటూ సామినేని ఆగ్రహంతో వెల్లంపల్లిని నిలదీసారు. ఇద్దరి మధ్య వాగ్వాదంలో నా నాయోజకవర్గంలో నీవు రాజకీయాలు చేస్తే నేను నీ నియోజకవర్గం జగ్గయ్యపేటలో వచ్చి రాజకీయాలు చేస్తానంటూ వెల్లంపల్లి హెచ్చరించారు. దీనికి స్పందనగా నీకు దమ్ముంటే జగ్గయ్య పేటలో అడుగు పెట్టు అంటూ ఉదయభాను సవాల్ చేసారు. పార్టీలో సీనియర్ నని.. నీ లాగా మూడు పార్టీలు మారలేదని.. ఊసరవెల్లివి నీవంటూ వెల్లంపల్లిపై సామినేని ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ ఉదయభాను వెల్లంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే సమయంలో కొన్ని పరుష.. అనుచిత పదాలతో ఇద్దరు నేతలు దూషించుకున్నారు. ఒకరినొకరు తోసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఈస్ట్ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ జోక్యం చేసుకొని ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో..వెల్లంపల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత జరిగిన వేడుకల్లో అవినాశ్, ఉదయభాను మాత్రమే కనిపించారు.
2014లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా ఆకుల శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వెల్లంపల్లి బీజేపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంత కాలంగా ఆకుల శ్రీనివాస్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన నియోజకవర్గంలోని అంశాలను సీఎంకు వివరించేందుకు ఉదయభాను సీఎం వద్దకు వెళ్లారు. అదే సమయంలో సీఎం నివాసం వద్ద ఆకుల శ్రీనివాస్ ఎదురయ్యారు. ఈ నెల 28న తన కుమార్తె వివాహమని.. ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చానని శ్రీనివాస్ సామినేని ఉదయభానుకు వివరించారు. దీంతో..ఇద్దరు కలిసి సీఎం వద్దకు వెళ్లారు. తన నియోజకవర్గం నుంచి తన పైన పోటీ చేసిన వ్యక్తిని సీఎం వద్దకు సామినేని తీసుకెళ్లటంతో వెల్లంపల్లి ఆగ్రహించారు. ఇదే ఇద్దరి మధ్య గొడవకు అసలు కారణమని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

Related News

Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ
తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Bachula Arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.