AP Govt : ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు నోటీఫికేషన్
ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
- By Latha Suma Published Date - 05:05 PM, Tue - 15 April 25

AP Govt: ఏపీ ప్రభుత్వం కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Read Also: Coconut Ritual: గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
కాగా, ఏపీలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యా శాఖ మంత్రి లోకేశ్ పలు మార్లు స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్‌పై పెట్టిన విషయం తెలిసిందే. ఇక, మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏపీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కొత్త విద్యా సంవత్సరం (2025-26) ప్రారంభం అయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఏపీ టెట్ పరీక్షను నిర్వహించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టెట్ ఫలితాల్లో 1,87,256 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది. ఈ టెట్ స్కోర్‌కు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (SA)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (PET)-132 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇప్పటికే ఏపీ డీఎస్సీ సిలబస్ కూడా విడుదల చేసింది. అయితే.. పూర్తి వివరాలను, ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.
Read Also: Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం