YS Jagan : అసెంబ్లీలో కాదు..ప్రభుత్వం తప్పులను మీడియా ద్వారానే ప్రశ్నిస్తాం: జగన్
YS Jagan : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 06:36 PM, Thu - 7 November 24

AP Assembly Meetings : ఏపీలో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయించింది. అంతేకాదు..ప్రతి మూడు రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో తమకు సభ్యులు తక్కువగా ఉన్నారని, అందువల్ల సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం దొరక్కపోవచ్చని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే కారణంతో తమ సభ్యులకు మైక్ ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు.
అసెంబ్లీ సమయంలో ముందు కొస్తాము కానీ.. మీడియానే తమకు స్పీకర్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను మీడియా ద్వారానే ప్రశ్నిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు. 40 శాతం ఓట్లు వచ్చిన వారిని గుర్తించరా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే సభలో మైక్ ఇవ్వాలి.. సభా పక్ష నాయకుడికి, ప్రతి పక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. సమస్యలు చెప్పనీయకుండా ఉండటానికే ప్రతిపక్ష పార్టీని గుర్తించటం లేదన్నారు.
మైక్ ఇస్తే ప్రభుత్వాన్ని ఎండగడతామని భయమని ఆయన అన్నారు. మైక్ ఇవ్వనపుడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమి ఉందని అన్నారు. మీడియా సమక్షంలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.