Nara Lokesh: లోకేష్ సైన్యం దూకుడు
మూస పద్ధతికి ఈసారి తెలుగుదేశం పార్టీ స్వస్తి పలకనుంది. వినూత్నంగా ఎన్నికలను ఫేస్ చేయడానికి సిద్ధం అవుతోంది. పోలింగ్ రోజున క్యాడర్ వ్యవహరించాల్సిన ప్రక్రియపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.
- By CS Rao Published Date - 01:14 PM, Fri - 7 January 22

మూస పద్ధతికి ఈసారి తెలుగుదేశం పార్టీ స్వస్తి పలకనుంది. వినూత్నంగా ఎన్నికలను ఫేస్ చేయడానికి సిద్ధం అవుతోంది. పోలింగ్ రోజున క్యాడర్ వ్యవహరించాల్సిన ప్రక్రియపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. అందుకు సంబంధించిన శిక్షణ ఇస్తోంది. నమూనాగా ఐదు జిల్లాలను తీసుకుని అధ్యయనం చేస్తున్నారు. ఎలక్షనీరింగ్ లో మారిన పరిణామాలకు అనుగుణంగా టీడీపీ క్యాడర్ సిద్ధం అవుతోంది. ప్రతి ఒక్క ఓటును ప్రాధాన్యంగా తీసుకుని బూత్ స్థాయి శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల వ్యవస్థకు సమాంతరంగా టీడీపీ సైన్యం సిద్ధం అవుతోంది. 2024 ఎన్నికలను పగడ్బంధీగా ఎదుర్కొవడానికి సన్నద్ధం అవుతోంది.
పోలింగ్ రోజున చాలా మంది ఓట్లు గల్లంతు కావడం చూశాం. ప్రత్యేకించి ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక, కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన పోలింగ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీని కొత్తగా ఆలోచింప చేసింది. పోలింగ్ రోజున వైసీపీ చేసిన దొంగ ఓట్ల వ్యవహారం, ఐడీ కార్డుల ఫోటోలు మార్చడం తదితరాలను గమనించింది. భారీగా ఓటరు ఐడీలను మార్చేశారని ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను తీసుకొచ్చి యధేచ్చగా ఓట్లు వేయించారని ఆధారాలతో టీడీపీ బయటపెట్టింది. బస్సుల్లో ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించడంపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిణామాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ అధ్యయనం చేసింది. 2024 ఎన్నికల్లో ఇలాంటి వాటిని వైసీపీ నుంచి ఎలా ఎదుర్కోవాలో..ఇప్పటి నుంచే టీడీపీ సిద్ధం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని వలంటీర్లు వైసీపీకి చెందిన కార్యకర్తలు. ఆ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన మాటల వీడియో అప్పట్లో హల్ చల్ చేసింది. వలంటీర్ల ద్వారా బూత్ ప్రాతిపదికన కులాలతో కూడిన ఓటర్ల వివరాలను వైసీపీ సేకరించింది. పార్టీల వారీగా కూడా అంచనా వేసింది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓటర్లను ఏదో ఒక రకంగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. సంక్షేమ పథకాలను ఇవ్వడం ద్వారా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం బూత్ ల వారీగా జరుగుతోంది. సంప్రదాయ టీడీపీ ఓటర్ల పై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ఇతర ప్రాంతాల్లో వాళ్ల నివసిస్తుంటే ఓటర్ల జాబితాను నుంచి తొలగించేందుకు రెడీ అవుతోంది. ఆ విషయాన్ని గమనించిన టీడీపీ బూత్ ల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేస్తోంది.
చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, వ్యాపారం చేసుకునే వాళ్లు ఏపీ గ్రామాల్లో ఓటర్లుగా ఉన్నారు. వాళ్లను జాబితా నుంచి వైసీపీ భారీగా తొలగించబోతుందని టీడీపీకి ఉన్న సమాచారం. అందుకే, ఆ ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చడానికి గ్రౌండ్ వర్క్ చేస్తోంది. సుమారు 15లక్షల మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని ప్రాథమికంగా గత ఎన్నికల్లో గుర్తించారు. ఆ వలసలు ఇప్పుడు ఇంకా పెరిగాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వం ఉపాథి అవకాశాలను కల్పించడంలో వెనుకబడింది. తెలంగాణ వేగంగా అభివృద్ధి పథాన వెళుతోంది. ఫలితంగా ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువ అయింది. ఇలాంటి వాళ్లు ఎక్కువగా టీడీపీ సానుభూతిపరులు ఉంటారని బూత్ స్థాయి అధ్యయనం ద్వారా తేలింది. అందుకే ఓటర్ల జాబితాపై ఇప్పటి నుంచే తమ్ముళ్లు కన్నువేశారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను గుర్తించడం, వాళ్లను ఎన్నికల నాటికి తీసుకొచ్చే బాధ్యతను కూడా వలంటీర్లకు సమాంతరంగా టీడీపీ ఏర్పాటు చేస్తోన్న లోకేష్ సైన్యం చేయబోతుంది. అందుకు సంబంధించిన నియామకాలు వేగంగా జరుగుతున్నాయి. తొలుత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియను నమూనాగా అమలు చేసిన తరువాత వచ్చే ఫలితాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేయాలని టీడీపీ భావిస్తున్నదట. ఇదంతా సో…బూత్ స్థాయిలో 2024 ఎన్నికల హడావుడి మొదలైయిందన్నమాట.