Nara Lokesh: కేంద్ర మంత్రులతో నారా లోకేష్ వరుస భేటీలు.. కీలక ప్రాజెక్టులపై చర్చ!
అనంతరం మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
- By Gopichand Published Date - 04:48 PM, Mon - 18 August 25

Nara Lokesh: విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గానూ కానూరు- మచిలీపట్నం మధ్య ఆరు లేన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధిపై చర్చించారు.
కీలక ప్రాజెక్టులపై చర్చ
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కానూరు-మచిలీపట్నం రోడ్డు విస్తరణకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాజధాని ప్రాంతం అభివృద్ధికి కూడా ఉపకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్-అమరావతి మధ్య కీలకమైన ఎన్ హెచ్-65 రహదారిని అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజీని డిపిఆర్ (Detailed Project Report)లో చేర్చాలని కోరారు. అలాగే, విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
నాగ్‌పూర్ మోడల్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు
విశాఖపట్నంలో 20 కి.మీ, విజయవాడలో 14.7 కి.మీ. మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్లను నాగ్‌పూర్ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని లోకేష్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పన, వ్యయాన్ని భరించే అంశంపై ఎన్హెచ్ఏఐ (NHAI), రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్‌ల మధ్య ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చ జరిగింది.
Also Read: Super Six – Super Hit : కూటమి పాలనలో అభివృద్ధికి అడ్డులేదు.. సంక్షేమానికి తిరుగులేదు
ఇతర రహదారుల నిర్మాణాలు
రాష్ట్రంలో రీజినల్ కనెక్టివిటీ, డెవలప్‌మెంట్ కారిడార్ల అభివృద్ధిలో భాగంగా పలు కీలక రహదారుల నిర్మాణ పనులను చేపట్టాల్సిందిగా లోకేష్ కేంద్ర మంత్రిని కోరారు. వీటిలో కర్నూలు-ఎమ్మిగనూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుకొండ-గుంటూరు మధ్య ఎన్ హెచ్ 544డి, కాకినాడ పోర్టు-ఎన్ హెచ్ 216 మధ్య దక్షిణ రహదారి, మరియు కాణిపాక వినాయక దేవాలయానికి లింకు రోడ్డు నిర్మాణాలు ఉన్నాయి.
కుప్పం గ్రీన్‌ఫీల్డ్ హైవే
బెంగుళూరు-చెన్నయ్ (ఎన్ఈ-7) రహదారికి డైరెక్ట్ కనెక్టివిటీ కోసం కుప్పం-హోసూరు-బెంగుళూరు మధ్య 56 కిలోమీటర్ల మేర రూ. 3 వేల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రాంతంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.
నిర్మలా సీతారామన్‌తో భేటీ
అనంతరం మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించి, భవిష్యత్తులో చేపట్టే కొత్త ప్రాజెక్టులకు కూడా సహకారం అందించాలని ఆమెను కోరారు.