TDP : శ్రీకాకుళం జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం.. కార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి ఆర్థికసాయం
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ
- Author : Prasad
Date : 04-01-2024 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. రాజాంలోని జీఎంఆర్ విడిది కేంద్రం వద్ద ప్రారంభమైన భువనేశ్వరి మొదటగా ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సింగడం మండలం, దేవలపేట గ్రామం వెళ్లారు. గతేడాది అక్టోబర్ 4న గుండెపోటుతో మరణించిన పార్టీ కార్యకర్త కంచరన అసిరినాయుడు(55) కుటుంబాన్ని కలుసుకున్నారు. అసిరినాయుడు భార్య అరుణకుమారి, కుమారులు అఖిల్, అభిషేక్ లతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు. అనంతరం పాలకొండ నియోజకవర్గం భామిని మండలం, బిల్లుమడ గ్రామంలో బర్రి విశ్వనాథం(57) కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాథం భార్య వనజాక్షి, కుమారుడు శివశశాంక్, కుమార్తె గౌతమితో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరమొచ్చినా పార్టీ అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుందని ధైర్యం చెప్పారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, తోటవాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి(76) కుటుంబాన్ని కలిశారు. సాంబమూర్తి భార్య ఎరకమ్మ, కుమారులు తవిటినాయుడు, జగదీశ్వరరావు, కుమార్తె పద్మావతిని పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కును అందించి ఆర్థికసాయం అందించారు. శ్రీకాకుళం జిల్లాల కార్యకర్తల కుటుంబాల పరామర్శ అనంతరం విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో బస చేశారు. భువనేశ్వరికి శ్రీకాకుళం జిల్లా కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. వివిధ సామాజికవర్గ ప్రజలు, అంగన్వాడీలు, వైసీపీ చేతిలో ఇబ్బందులకు గురైన పలువురు భువనేశ్వరిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసానిచ్చారు. తన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తూ..వారిని పలకరిస్తూ రెండో రోజు పర్యటనను భువనేశ్వరి విజయవంతంగా పూర్తిచేశారు. రెండో పర్యటనలో భువనేశ్వరితో ఉత్తరాంధ్ర నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Also Read: Paderu : పాడేరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు