Mahanadu 2025 : ‘మహానాడు’కు స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ఆహ్వానం
Mahanadu 2025 : పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్(NTR)ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మళ్లీ మహానాడు వేదికపైకి తీసుకురావడం విశేషం.
- By Sudheer Published Date - 12:29 PM, Tue - 6 May 25

టైటిల్ చూసి షాక్ అవుతున్నారా..? చనిపోయిన వ్యక్తికి ఆహ్వానం ఏంటి అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచేలా ఈ సారి మహానాడు (Mahanadu 2025) నిర్వహణకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకతలతో నిండి, ఆధ్యాత్మికత, సాంకేతికత, రాజకీయ చైతన్యం సమ్మిళితంగా ఉండే ఈ మహానాడు, ఏపీ మాజీ సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప(Kadapa)లో తొలిసారిగా జరుగుతున్నందున ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణ స్థాయిని దాటి అసాధారణ స్థాయిలో జరుగనున్న ఈ మహానాడులో మూడు ముఖ్యమైన ప్రత్యేకతలు ఉండనున్నాయని పార్టీ సీనియర్ నాయకులు వెల్లడించారు.
Real Estate : హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్
మొదటి ప్రత్యేకతగా.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్(NTR)ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మళ్లీ మహానాడు వేదికపైకి తీసుకురావడం విశేషం. ఇది కేవలం భావోద్వేగానికి మాత్రమే కాకుండా, టెక్నాలజీ పరంగా ఎంతో ప్రగతిని సూచించే కార్యక్రమంగా మారనుంది. ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కలిసి రూపొందించే ఈ ఏఐ ప్రదర్శన ద్వారా ఎన్టీఆర్ మాట్లాడే విధంగా అనుభూతి కలిగించనున్నారు. ఇది పార్టీలో నూతన ఉత్సాహం నింపేలా ఉంది. రెండవది.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి 75వ పుట్టినరోజు పురస్కరించుకుని, ఆయన రాజకీయ జీవితాన్ని మూడు భాగాలుగా షార్ట్ ఫిల్మ్‌ల రూపంలో ప్రదర్శించనున్నారు. ఇది పార్టీ నాయకులకు ప్రేరణగా ఉండడంతో పాటు, చంద్రబాబు సేవలను మరోసారి గుర్తుచేస్తుంది.
Terrorist Hideout : పంజాబ్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు
మూడవ ప్రత్యేకత.. టీడీపీని పూర్తిస్థాయిలో ఏఐ ఆధారిత పార్టీగా అభివృద్ధి చేయడమే. ఇప్పటివరకు ‘డిజిటల్ టీడీపీ’గా ఉన్నా, ఇప్పుడు ఏఐ ఆధారంగా నాయకుల పనితీరు, కార్యకర్తల సామర్థ్యాన్ని అంచనా వేసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ మరింత బలోపేతం కానుందని అంచనా. సో ఈ మహానాడునభూతో నా భవిష్యత్ ల ఉండబోతుందని అర్ధం అవుతుంది.