YCP : తిరుపతి వైసీపీ నేతలతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశం.. అన్ని స్థానాలు గెలుచేందుకు ప్రణాళిక చేయాలని ఆదేశం
వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు, తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకునేలా చూడాలని
- Author : Prasad
Date : 30-09-2023 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు, తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకునేలా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. రెండు రోజుల తిరుపతి పర్యటనలో భాగంగా పార్టీ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించి శ్రీకాళహస్తి, వెంకటగిరి, తిరుపతి, గూడూరు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, పార్టీ సంస్థాగత అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలో పార్టీ నియోజకవర్గ నాయకులు, సమన్వయకర్తలు, ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులకు ఎంపీ విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడంపైనే అందరి దృష్టి ఉండాలి. అభిప్రాయ భేదాలు ఉంటే పక్కన పెట్టి పార్టీ గెలుపునకు కృషి చేయాలని నేతకు దిశానిర్ధేశం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున అమలవుతున్నాయని, దీని ద్వారా ప్రజల ఆదాయ స్థాయిలు, జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పాఠశాలలు, ఆసుపత్రుల స్థితిగతులను గణనీయంగా మార్చారని..ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పులు ఫలితాలను ఇస్తున్నాయన్నారు.