Nara Lokesh In USA: అమెరికా లో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీ
- By Kode Mohan Sai Published Date - 01:00 PM, Mon - 28 October 24

మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన చేస్తున్నాడు. ఆయన పెరోట్ మరియు టెస్లా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మొదట, లోకేష్ పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఏవియేషన్ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఏపీ తీరప్రాంతం టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు అనుకూలంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరగా, పెరోట్ గ్రూప్ ఛైర్మన్ రాస్ పెరోట్ సానుకూలంగా స్పందించారు.
పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డల్లాస్ లో భేటీ అయ్యారు. పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు.… pic.twitter.com/5orEr35qrF
— Telugu Desam Party (@JaiTDP) October 28, 2024
మరోవైపు, నారా లోకేష్ టెస్లా (ఆస్టిన్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు, ఇక్కడ ఆయన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా సంస్థ CFO వైభవ్ తమేజాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని సాధించాలని లక్ష్యం పెట్టుకున్నామని, అందుకోసం టెస్లా నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో సోలార్ పవర్, స్మార్ట్ సిటీలు, మరియు గ్రామీణ విద్యుదీకరణకు సోలార్ ప్లేట్స్ అమర్చడంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ తెలిపారు. అలాగే, ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ అభివృద్ధి మరియు సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అమల్లో భాగస్వామ్యం కోసం కూడా సూచనలు చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని కూడా టెస్లా CFOను కోరారు. ఈ సందర్భంగా, వైభవ్ తమేజా, టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, మరియు బ్యాటరీ స్టోరేజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్నారని పేర్కొన్నారు.
అంతకముందు, మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సమావేశానికి హాజరయ్యారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ మరియు వ్యాపారం జరపటానికి వేగం పెంచడానికి కట్టుబడి ఉంది’ అని మంత్రి చెప్పారు. ‘రాష్ట్రంలో యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని అందించడానికి సంబంధించి ఆరు పాలసీలు తీసుకొచ్చామని’ వివరించారు. ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడుల కోసం కూడా భారీగా ఎదురుచూస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 25% మొబైల్స్ మరియు 50% ఏసీలు ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుతున్నాయి’ అని పేర్కొన్నారు.
కర్నూలును డ్రోన్ వ్యాలీగా, చిత్తూరు మరియు కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌లుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కృష్ణా మరియు గుంటూరు కేపిటల్ రీజియన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలపై దృష్టి పెట్టాలని ఉత్తరాంధ్రలో కెమికల్ మరియు ఫార్మా రంగాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి లోకేష్ మరికొందరు పారిశ్రామికవేత్తలు మరియు ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. అలాగే, శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని కూడా సందర్శించారు.