Kodali Nani: చంద్రబాబు ఉచ్చులో పడొద్దు పవన్.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
- Author : HashtagU Desk
Date : 27-02-2022 - 2:16 IST
Published By : Hashtagu Telugu Desk
భీమ్లా నాయక్ మూవీ ముసుగులో, ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్‌కి భీమ్లా నాయక్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అనేలా ఎల్లో మీడియా విషపురాతలు రాస్తూ, పీకే ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతుంది. ఈ క్రమంలో
విపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.
పవన్ కల్యాణ్ అయినా నాగార్జున అయినా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఒకటేనని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితకి కుట్రలు, కుతంత్రాలు తెలియదన్నారు. భీమ్లా నాయక్ సినిమాకు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి షరతులు పెట్టలేదని, టికెట్ల రేట్లపై కమిటీ సూచనలు చేసిందని, అయితే పెంచే లోపు కొన్ని అవాంతరాలు రావడంతో జీవో రావడానికి ఆలస్యమైందని నాని తెలిపారు.
ఇక సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు మెగాస్టార్ చిరంజీవి, జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ దగ్గర చిరంజీవి విన్నపంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యల పై స్పందించిన నాని, సినిమాలు, రాజకీయాలను ముడిపెట్టొద్దని, చంద్రబాబును నమ్మి మోసపోవొద్దని పవన్‌కు నాని సూచించారు.
సీఎం జగన్‌కు చిరంజీవి పై అభిమానం ఉందని, ఆయన్ను జగన్ ఎంతో గౌరవిస్తారని, చిల్లర రాజకీయాల్లోకి చిరంజీవిని లాగడం సరికాదన్నారు. ఈ క్రమంలో చిరంజీవిని కుటుంబ సమేతంగా జగన్ ఆహ్వానించారన్న విషయాన్ని నాని గుర్తు చేశారు. చిరంజీవికి జగన్ వద్ద ఎలాంటి అవమానం జరగలేదని, టీడీపీ అండ్ ఎల్లో మీడియా కావాలనే విష ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.
చంద్రబాబు కోసం సొంత తమ్ముడే, అన్నను అవమానిస్తారా, ఇప్పుడు పవన్ అండ్ ఆయన కుటుంబం ఉన్నత స్థానంలో ఉందంటే చిరంజీవి కారణం కాదా అని కొడాలి నాని ప్రశ్నించారు. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం తొక్కేసిందని ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని, సినీ పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబే కారణమని, టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కొడాలి నాని పేర్కొన్నారు.
భీమ్లా నాయక్ సినిమా విషయంలో నానా యాగీ చేస్తున్నవారు.. అంతకు ముందు రిలీజ్ అయిన అఖండ, బంగర్రాజు సినిమాల తరహాలోనే ప్రభుత్వం వ్యవహరించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కుల, మత ధ్వేషాలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు నిత్యం ప్రయత్నిస్తారని కొడాలి నాని అన్నారు. టిక్కెట్ ధరలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు ఉచ్చులో పడి సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కొడాలి నాని సూచించారు. మరి కొడాలి నాని వ్యాఖ్యల పై టీడీపీ అండ్ జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.