Telugu Man Died : సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి
అమెరికా గడ్డపై మరో తెలుగుతేజం నేలరాలాడు.
- By Pasha Published Date - 11:33 AM, Sun - 23 June 24

Telugu Man Died : అమెరికా గడ్డపై మరో తెలుగుతేజం నేలరాలాడు. దుండగుల కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన 32 ఏళ్ల దాసరి గోపీకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని ఆర్కెన్సాస్ రాష్ట్రంలో ఉన్న ఓ సూపర్ మార్కెట్‌లో దాసరి గోపీకృష్ణ పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు ఆ సూపర్ మార్కెట్‌లోకి చొరబడి విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో గోపీకృష్ణ(Telugu Man Died)తో పాటు 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం దుండగుడు ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సిగరెట్ ప్యాకెట్ కోసమే దుండగుడు కాల్పులు జరిపాడని పోలీసులు గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join
దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అందులోని సీన్‌లను కాల్పులు జరిపిన దుండగుడి వయసు 16 ఏళ్లే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతడు గోపీకృష్ణ పనిచేస్తున్న సూపర్ మార్కెట్లోకి వస్తూనే కాల్పులు మొదలుపెట్టాడు. అక్కడున్న వారిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి కాల్చడం మొదలుపెట్టాడు. ఇదేవిధంగా గోపీకృష్ణను కూడా గన్‌తో కాల్చాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :Cabinet Expansion : జులై 2న మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్నది వీరే ?
ఈ ఘటనలో గాయపడిన 13 మందిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. చికిత్సపొందుతూ దాసరి గోపీకృష్ణతో పాటు మరో ఇద్దరు చనిపోయారు. ఇంకో 10 మందికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. గోపీకృష్ణ మరణవార్త తెలుసుకొని వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపీకృష్ణ ఇండియాలోనే ఎమ్మెస్ పూర్తి చేశాడు. జీవనోపాధి కోసం 8 నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు.