మదనపల్లె ఫైళ్ల దహనం కేసు…. ఇక పెద్దిరెడ్డి అరెస్ట్…??
- Author : Vamsi Chowdary Korata
Date : 20-03-2026 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
Madanapalle Files Burnt Case ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలను CID అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.
విదేశాల నుంచి తిరిగొస్తున్న నిందితుల కదలికలపై నిఘా ఉంచిన CID బృందం, తిరుపతి సమీపంలోని పనపాకం టోల్‌గేట్ దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పెద్దిరెడ్డికి కుడిభుజాలుగా పేరున్న వీరిద్దరి అరెస్ట్ ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరికీ చిత్తూరు జిల్లా నాలుగో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు, మదనపల్లె పరిసరాల్లో జరిగిన వేల కోట్ల భూ కుంభకోణాలను కప్పిపుచ్చడానికే ఫైళ్లను తగలబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. 22-A భూములు, నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, పేదల భూములను అక్రమంగా మ్యూటేషన్ చేయడం, కోర్టు కేసులు, విచారణల్లో ఉన్న కీలక పత్రాలను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఈ కేసును సవాల్‌గా తీసుకుంది. కేవలం కింది స్థాయి అధికారులపై చర్యలతో సరిపెట్టకుండా, ఈ కుట్ర వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫైళ్లకు నిప్పు పెట్టారు? ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు పట్టుబడిన నిందితుల ద్వారా సమాధానాలు లభించే అవకాశం ఉంది.
అరెస్ట్ అయిన ముని తుకారాం, మాధవరెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ వీరు నోరు విప్పితే, ఈ విచారణ సెగ నేరుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. CID విచారణ వేగవంతం కావడంతో త్వరలోనే మదనపల్లె భూ కుంభకోణంపై పూర్తి స్థాయి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.