Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం మిథున్‌రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్‌రెడ్డి వద్ద విశేషమైన కారణాలు లేవని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.
- By Latha Suma Published Date - 01:02 PM, Fri - 18 July 25

Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపణలతో తిరస్కరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం మిథున్‌రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్‌రెడ్డి వద్ద విశేషమైన కారణాలు లేవని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. దర్యాప్తు పూర్తికాక ముందే ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. ఛార్జిషీట్ దాఖలు చేయడం, కానీ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ, సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) తరఫు న్యాయవాదిని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇది విచిత్రంగా లేదని, దీని వెనక ఉద్దేశం ఏమిటని వివరంగా విచారణ చేపట్టారు. ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది, ముందస్తు బెయిల్ అవసరాన్ని వివరించడంలో విఫలమవడంతో కోర్టు మిథున్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించింది.
Read Also: Harish Rao : బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా : హరీష్ రావు
మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత మిథున్‌రెడ్డి తాను నిందితుడిగా మారతానని అంచనా వేసి ముందే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయంలో ఆయన్ను కేసులో నేరుగా నిందితుడిగా పేర్కొనలేదు. అందువల్ల ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కానీ తరువాత జరిగిన సిట్ దర్యాప్తులో ఆయన ప్రమేయం బయటపడటంతో, మిథున్‌రెడ్డిని ‘ఏ4’ నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగిన సమయంలో అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, ఇప్పుడు పూర్తిస్థాయిలో పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో మిథున్‌రెడ్డి పై ఉక్కుపాదం మరింత బిగించనుంది. ఇదిలా ఉండగా, ఆయనపై ఇప్పటికే సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో, మిథున్‌రెడ్డి విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
అయితే, కోర్టు తీర్పు వెలువడనుందని ముందే అంచనా వేసిన మిథున్‌రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కేసు బయటపడిన తరుణంలో ఆయన కొన్ని వారాలు అజ్ఞాతంలోనే గడిపారు. ఇప్పుడు తిరిగి అతడిపై కేసు తీవ్రత పెరిగిన నేపథ్యంలో మళ్లీ కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ కోసం సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఆయన కనిపించిన వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, మద్యం కుంభకోణం కేసు మరింత కీలక దశలోకి ప్రవేశించింది. మిథున్‌రెడ్డి అరెస్ట్ అయినపుడు కేసులో మరిన్ని కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.