Lemon Price: సామాన్యుడిని పిండేస్తున్న నిమ్మ..!
- By HashtagU Desk Published Date - 01:27 PM, Mon - 4 April 22

నిమ్మకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు అటు సామాన్యుల నుంచి ఇటు సెలబ్రెటీల వరకు నిమ్మకాయతో తయారు చేసిన రకరకాల వాటర్‌ను తాగడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో లెమన్ వాటర్ దాహార్తిని తీర్చడమే కాదు తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే.
దీంతో వేసవి ముందు చవకగా దొరికిన నిమ్మకాయ, ఇప్పుడు వేసవి రాకతో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఎండలు అదరగొడుతున్నాయి. దీంతో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అటు తెలంగాణ రాష్ట్రాల్లో నిమ్మకాయలకు గిరాకీ పెరిగిపోతోంది. దీంతో వీటి ధరలు ఆపిల్ ధరలతో పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోతెలుగు రాష్ట్రాల్లో ఒక నిమ్మకాయ ధర దాదాపు పది రూపాయలు పలుకుతూ వినియోగదారులకు షాక్ ఇస్తోంది.
ఇక కరెక్ట్‌గా చెప్పాలంటే నిమ్మ ధరలు ప్రస్తుతం ఆపిల్ పండ్ల ధరలతో పోటీకీ సై అంటున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నిన్న మొన్నటి వరకు నిమ్మ రైతులు ధరలు లేక దిగాలు పడ్డారు. అయితే ఇప్పుడు మార్చి నుండే ఎండలు దంచి కొడుతుండడంతో నిమ్మ రైతులకు కాలం కలిసొచ్చింది. దీంతో నిమ్మకాయల డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో నిమ్మ రైతులకు లాభాల బాట పట్టారు. ప్రస్తుతం యాపిల్ పండ్ల రేట్లతో పోటీ పడుతున్న నిమ్మకాయలు, ఆదివారం గూడూరు మార్కెట్లో రికార్డు ధర పలికాయి.
ఈ క్రమంలో అక్కడి మార్కెట్‌కు ఓ రైతు తీసుకొచ్చిన మొదటి రకం నిమ్మకాయలను వ్యాపారులు కిలో 160 చొప్పున కొనుగోలు చేశారు. రెండో రకం నిమ్మకాయలు 130-150 మధ్య పలుకుతుండగా, ఇంకో రగం నిమ్మాకాలు 100-130 మధ్య ధర పలుకుతున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమ్మకాయల ధరలకు ఊహించని విధంగా ఎక్కువ ధర పలుకుతోందని అక్కడి స్థానిక రైతులు చెబుతున్నారు. దీంతో కిలో యాపిల్ పండ్లకు, కిలో నిమ్మకాయలకు పెద్ద తేడా లేదని, ఎక్కడి నుంచో దిగుమతి చేసుకునే యాపిల్ పండ్లు కిలో 150 నుంచి 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి నిమ్మ ధరలు సామాన్యుడిని పిండేస్తున్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు.