CM Jagan: జగన్ పాలన 2.0 కేరాఫ్ దావోస్
ఏపీ సీఎం జగన్ పరిపాలన 2.0ను చూపించబోతున్నారు. ఆయన 2019న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలు మాత్రమే పరిపాలన సాగించారు.
- Author : CS Rao
Date : 22-04-2022 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ పరిపాలన 2.0ను చూపించబోతున్నారు. ఆయన 2019న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలు మాత్రమే పరిపాలన సాగించారు. ఆ తరువాత కోవిడ్ రావడంతో పూర్తి స్థాయి పాలనకు అవకాశం లేకుండా పోయింది. కేంద్ర విడుదల చేసే మార్గదర్శకాలను అమలు చేయడం మినహా ఎలాంటి ఇతరత్రా అభివృద్ధిని పట్టాలు ఎక్కించలేకపోయారు. మూడు రాజధానులు, అమరావతి ఇష్యూ చుట్టూ ఆయన మూడేళ్ల పాలన సాగింది.
సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యమంటూ జగన్ పాలనపై ముద్రపడింది. ఉపాథి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందారని సర్వత్రా వినిపిస్తోంది. సచివాలయాలు, వలంటీర్ల ఉద్యోగాలు కూడా సొంత పార్టీ వాళ్లకే ఇచ్చారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మూడేళ్ల జగన్ పాలన అంతా అప్పులు తేవడం, పంచి పెట్టడం అంటూ ముక్తకంఠంతో ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మేధావులు సైతం ఆయన పాలనపై వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల చేసిన సర్వేలోనూ వ్యతిరేకతను జగన్ గమనించారట. అందుకే, అభివృద్ధి దిశగా మిగిలిన రెండేళ్ల పాలనను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా తొలి అడుగు దోవోస్ నుంచి వేస్తున్నారు.
పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెలలో ఆయన దావోస్ కు పయనం కానున్నారు.
మే 22న దావోస్ కు వెళ్లే సీఎం వారం రోజుల పాటు అక్కడే ఉంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఆయనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబర్ లోనే జరగాల్సి ఉంది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసరడంతో సమ్మిట్ వాయిదా పడింది. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ గానే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఈ సదస్సు ద్వారా పారిశ్రామికవేత్తలను జగన్ ఆహ్వానించబోతున్నారు. ఆయన ఇచ్చే ప్రజెంటేషన్ ఆధారంగా పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయి. పరిపాలన వేగవంతం చేయడంతో పాటు అభివృద్ధిని పరుగు పెట్టించే మాస్టర్ ప్లాన్ జగన్ వద్ద ఉందని తాడేపల్లి వర్గాలు టాక్. ఈ రెండేళ్ల జగన్ పరిపాలనను 2.0గా పరిగణించవచ్చని చెబుతున్నారు.