Jagananna Suraksha: విజయమే లక్ష్యంగా.. జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం.. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు..
గ్రామ స్థాయిలో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొంటారు. వీరి ఆధ్వర్యంలో రెండు వేరువేరు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు.
- Author : News Desk
Date : 21-06-2023 - 10:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan Reddy) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలను అమలు చేస్తున్న జగన్.. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటికి మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమం ద్వారా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారికి పథకాలు అందించడంలో ప్రభుత్వం విజయవంతం అయింది. అంతేకాక, అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూ నేరుగా బ్యాంకుల్లోనే ఆ పథకాలకు సంబంధించిన నగదును లబ్ధిదారులకు జగన్ ప్రభుత్వం అందజేస్తుంది. తాజాగా మరో కొత్తగా కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.
ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో కొత్త కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కొత్త కార్యక్రమం జూన్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా ప్రతీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగమే ఈకొత్త కార్యక్రమం అని వై.ఎస్. జగన్ ఇప్పటికే సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర ప్రత్యేక క్యాంపులు నాలుగు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంపుల్లో 11 రకాల సేవలు ఎలాంటి సర్వీస్ చార్జీలు వసూలు చేయకుండా అందించనున్నారు. దీనికితోడు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అంతేకాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా స్వీకరించనున్నారు.
గ్రామ స్థాయిలో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొంటారు. వీరి ఆధ్వర్యంలో రెండు వేరువేరు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు. మరోవైపు ఈ క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 11రకాల సేవలను అర్హులైన ప్రతీఒక్కరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గ్రామ స్థాయిలోని క్యాంపుల్లో సాధ్యమైనంత వరకు సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఒకవేళ సమస్యను పరిష్కరించలేక పోతే ఎందుకు పరిష్కరించలేక పోయామనే విషయాన్నిసైతం తెలియజేయాల్సి ఉంటుంది.