Pawan Kalyan Stunt : పవన్ కు `జరిమానా` ఇష్యూ.!
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఇష్యూలో పవన్ ఇరక్కపోయారు. హైకోర్టు ఆదేశం ప్రకారం ఆక్రమణదారులు 14లక్షలు జరిమానా చెల్లించాలి.
- Author : CS Rao
Date : 25-11-2022 - 4:11 IST
Published By : Hashtagu Telugu Desk
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఇష్యూలో పవన్ ఇరక్కపోయారు. హైకోర్టు ఆదేశం ప్రకారం ఆక్రమణదారులు 14లక్షలు జరిమానా చెల్లించాలి. ఆ మొత్తాన్ని ఎవరు చెల్లించాలి? గ్రామస్తులు పే చేయాలా? పవన్ ఆ మొత్తాన్ని భరించాలా? అనేది ఇప్పుడు ఎదురువుతోన్న ప్రశ్న.
రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం ముందస్తుగా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత ఆక్రమణలను కూల్చారు. అంతేకాదు, పంచాయితీ తీర్మానం కూడా ఉంది. అయినప్పటికీ గ్రామంలోని ఆక్రమణలను రాజకీయ కోణం నుంచి పవన్ తీసుకెళ్లారు. జనసేన ఆవిర్భావ సభకు భూములను ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్లను కూల్చిందని ఆరోపణలకు దిగారు. ఆక్రమణదారులకు మద్ధతుగా నిలిచేందుకు ఇప్పటం గ్రామం వెళ్లారు. వాళ్లకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాంత్రి ఇళ్లను కూల్చుతారా? అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను పలు విధాలుగా దూషించారు. దానిపై న్యాయపోరాటానికి వెళ్లేలా పవన్ చేయడం ఇప్పుడు వివాదస్పదం అయింది.
ఆక్రమణల తొలగింపు అంశంలో జరిగిన చట్ట ప్రక్రియను హైకోర్టులో ఏపీ ప్రభుత్వం వినిపించింది. ఆ సందర్భంగా ఆక్రమణదారులు ఎలాంటి ఆధారాలను చూపలేకపోయారు. నోటీసులు జారీ చేసిన విషయాన్ని రాతపూర్వకంగా ప్రభుత్వం కోర్టు ముందు ఉంచింది. నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణలను తొలగించినట్టు గ్రామస్తులు రుజువు చేయలేకపోయారు. ఫలితంగా కోర్టును పక్కదోవ పట్టించినట్టు భావించిన న్యాయమూర్తి ఒక్కొక్కళ్లకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. దీంతో పవన్ ఇరుకునపడ్డారు.
ఇప్పటం ఎపిసోడ్ లో ఉద్దేశపూర్వకంగా పవన్ కు టీడీపీ అభాసులపాలు చేసిందని మంత్రి రోజా రివర్స్ ప్రచారం మొదలు పెట్టారు. ఆ గ్రామం మంగళగిరిలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ ను ఆక్కడి పంపకుండా పవన్ ను వ్యూహాత్మకంగా పంపించారని రోజా అనుమానాన్ని రేకెత్తించారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుదని, పవన్ కల్యాణ్ ను కూడా అలాగే వాడుకుని వదిలేస్తాడని రోజా విమర్శిలకు దిగారు. రాష్ట్ర సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని పవన్ చంద్రబాబు ఉచ్చులో చిక్కుకోకుండా వాస్తవాలనును గ్రహించాలని హితవు పలికారు.
ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్టులో ఘటనలో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు వాడుకున్నారని వైసీపీ చేస్తోన్న రివర్స్ రాజకీయ దాడి. ఇప్పటం ఎపిసోడ్ లోనూ తెలివిగా పవన్ ను ఇరికించాడని రోజా ఆరోపించారు. హైకోర్టుకే తప్పుడు సమాచారం అందించారని, రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించడం పవన్ కల్యాణ్ కు చెంపపెట్టు అంటూ రోజా వ్యంగ్యాస్త్రాలు ఆయన మీద సంధించారు. ఇప్పుడు జరిమానా ఎవరు కడతారని వైసీపీ నిలదీస్తోంది.