Indrakeeladri : మహిషాసురమర్థినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ.. నేటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రులు
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం (ఆశ్వయుజ శుద్ధ నవమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత
- By Prasad Published Date - 02:55 PM, Mon - 23 October 23

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం (ఆశ్వయుజ శుద్ధ నవమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో దుష్టుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఈ తల్లికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన అనంతరం జగన్మాత కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి కనకదుర్గమ్మ అధిష్టానదేవత. శాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ పసుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ, ఎరుపు రంగుల చీరలు ధరించి చెరకుగడ చేతిలో పట్టుకుని భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తుంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహించే ఈ శక్తి స్వరూపిణికి పాయసం, చక్రాన్నం, దద్యోజనం, గారెలు, పూర్ణాలు, కదంబం, పులిహోర, కేసరి … ఇలా పదిరకాల రాజభోగాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం పూర్ణాహుతి అనంతరం సాయం సంధ్యా సమయంలో గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను హంస వాహనంపై పవిత్ర కృష్ణా తీరంలో ఊరేగిస్తారు. విద్యుత్తు దీపకాంతులు, మంగళహారతులు, వేదమంత్రాలు, బాణాసంచా వెలుగుల నడుమ అంగరంగ వైభవంగా జరిగే ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. తెప్పోత్సవంలో దుర్గగుడి నుంచి గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను పల్లకిలో ఊరేగింపుగా మల్లేశ్వరాలయం మెట్ల మార్గం నుండి దుర్గాఘాట్‌కు తీసుకువస్తారు. తెప్పోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను జమ్మిదొడ్డి వద్దకు తీసుకువచ్చి అక్కడి నుంచి ఉత్సవమూర్తులను వన్‌టౌన్ పోలీసులకు అప్పగిస్తారు.
Also Read: Vivek -Rajagopal Reddy : కాంగ్రెస్‌లోకి వివేక్, రాజగోపాల్ రెడ్డి.. కారణం అదేనా ?