Montha Cyclone Effect : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
Montha Cyclone Effect : తుఫాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు
- By Sudheer Published Date - 09:40 AM, Wed - 29 October 25
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీప తీరాన్ని మొంథా తుఫాను ఢీకొట్టడంతో, దీని ప్రభావం తెలంగాణపై తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బలమైన వర్షపాతం నమోదవుతోంది. హైదరాబాద్ నగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని, విరామం ఇస్తూ మళ్లీ మళ్లీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. కుత్బుల్లాపూర్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రా, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెల్లవారుజామున ఆఫీసులకు వెళ్లే వారు సమయానికి బస్సులు అందక ఇరకాటంలో పడ్డారు.
Banana-Milk: రాత్రిపూట పాలు,అరటిపండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో రెండు మూడు గంటల పాటు మహబూబ్‌నగర్, గద్వాల్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హనుమకొండ, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 50 నుండి 100 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వికారాబాద్ లో 42 మి.మీ, నాగర్‌కర్నూల్‌లో 34.3 మి.మీ, నల్గొండలో 33.5 మి.మీ, సంగారెడ్డి గుండ్లమాచనూరులో 31.8 మి.మీ వర్షపాతం నమోదైంది. రాత్రి నాటికి వర్షాలు నెమ్మదిగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి..ప్రమాదంలో వేలాదిమంది
తుఫాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. మంచిరేవుల కల్వర్టుపై నీరు ప్రవహించడంతో రాకపోకలపై ప్రభావం పడింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పిల్లలను బయటకు పంపకూడదని, వర్షం తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద మొంథా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుండడంతో రాష్ట్రం అప్రమత్తంగా ముందడుగు వేస్తోంది.