Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.
- By Kavya Krishna Published Date - 10:31 AM, Thu - 4 September 25
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు. ఇవి దేశ ప్రజలకు నిజమైన దీపావళి కానుక అని ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చినట్టే ఈ జీఎస్టీ సంస్కరణలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలు, రైతులు, ఆరోగ్యరంగం వంటి కీలక విభాగాలకు ఈ పన్ను తగ్గింపులు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని అన్నారు.
GST 2.0: 40 శాతం జీఎస్టీతో భారమేనా? సిగరెట్ ప్రియుల జేబుకు చిల్లు తప్పదా?
విద్య, బీమా రంగాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం ద్వారా అనేక కుటుంబాలకు నిజమైన భరోసా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జీఎస్టీ కౌన్సిల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధినేతతో పాటు బీజేపీ ప్రముఖ నేతలు కూడా ఈ సంస్కరణలను ప్రశంసించారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకే ఈ “నెక్స్ట్-జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు” వచ్చాయని గుర్తుచేశారు.
కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. వీరు మాట్లాడుతూ, ఈ పన్ను తగ్గింపులు కేవలం ప్రజల జీవితాల్లో ఉపశమనం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇస్తాయని అన్నారు. రైతులు, వ్యాపార వర్గాలు, సామాన్యులు అందరూ సమానంగా లాభపడేలా తీసుకొచ్చిన ఈ సంస్కరణలు, ప్రజలపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చిన ఈ “నిజమైన దీపావళి కానుక” శుభప్రదమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
GST 2.0 : సామాన్యులకు భారీ ఊరట.. 18% జీఎస్టీలోకి వచ్చేవి ఇవే..!!