Talliki Vandanam: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు
- Author : Vamsi Chowdary Korata
Date : 18-07-2026 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ నిరుపేద అంగన్వాడీ ఉద్యోగులకు సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎంతో కాలంగా సేవలందిస్తున్న 47,555 మంది అంగన్వాడీ సిబ్బందిని ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న అంగన్వాడీల పిల్లలకు ఏడాదికి రూ. 13,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. గతంలో ఉన్న కఠినమైన నిబంధనల వల్ల ఈ లబ్ధిని కోల్పోయిన వేలాది మంది తల్లులకు ప్రభుత్వ తాజా నిర్ణయం పెద్ద ఊరటను ఇచ్చింది.
‘తల్లికి వందనం’ పథకం నియమ నిబంధనల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నెలవారీ ఆదాయం రూ. 10,000 మించకూడదనే నిబంధన ఉండేది. అయితే, ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనం రూ. 11,500 గా ఉండటంతో, కేవలం రూ. 1,500 ఆదాయం ఎక్కువగా ఉందన్న సాంకేతిక కారణంతో ఇన్నాళ్లూ వీరికి ఈ పథకం వర్తించలేదు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు పడుతున్న కష్టాలను, వారి పిల్లల చదువుల ఆవశ్యకతను గుర్తించిన ఏపీ ప్రభుత్వం, ఈ ఆదాయ పరిమితి నిబంధనలను సడలిస్తూ ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పట్ల అంగన్వాడీ సంఘాలు మరియు గ్రామీణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.