AP Budget 2022-23: ఏపీ బడ్జెట్‌లో ఆ నాలుగు పైనే ప్రత్యేక దృష్టి..!
- By HashtagU Desk Published Date - 02:30 PM, Fri - 11 March 22

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపర్చిన బుగ్గన, మూలధన వ్యయం 47,996 కోట్లు అని బుగ్గన సభకు వివరించారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉండబోతుందని తెలిపిన బుగ్గన, ద్రవ్య లోటు 48,724 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్యలోటు 3.64శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.
ఈ నేపధ్యంలో వైసీపీ పింఛను కానుక కింద బడ్జెట్‌లో 18 వేల కోట్లను కేటాయించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి 3,900 కోట్లు కేటాయింపును ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రోడ్లు భవనాల శాఖకు 8,581 కోట్లు, వైద్య శాఖకు 15,384 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,755 కోట్లు, కార్మిక శాఖకు 790 కోట్లు, న్యాయశాఖ 924 కోట్లు, మున్సిపల్ శాఖకు 8,796 కోట్లు, మైనారిటీ శాఖకు 2,063 కోట్లు, పంచాయతీరాజ శాఖకు 15,084 కోట్లు, హౌసింగ్ కు 4,791 కోట్లు, ఇరిగేషన్ శాఖకు 11,482 కోట్లు కేటాయించారు.
ఇక సాంఘీక సంక్షేమానికి 12,728 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కు 18,518 కోట్లు, బీసీ సబ్ ప్లాన్ కు 29,143 కోట్లు, ఈబీసీల సంక్షేమానికి 6,900 కోట్లు, జగనన్న వసతి దీవెనకు 2,093 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 3,793 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి 500 కోట్లు, పశుసంవర్థక శాఖకు 1,568 కోట్లు, పర్యావరణ, అటవీ శాఖకు 658 కోట్లు, విద్యుత్ శాఖకు 10,281కోట్లు, క్రీడాశాఖకు 290 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 15,381 కోట్లు కేటాయింపులు జరిపారు. ఈసారి నాలుగు ప్రధానాంశాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించామని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేనంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
ఈ క్రమంలో మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు ఇవ్వడం, సామాజిక భద్రత అనే నాలుగు అంశాలపైనే ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు బుగ్గన. ఈ నాలుగింటిని ప్రపంచంలోని ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ప్రామాణికంగా తీసుకున్నాయని బుగ్గన రాజేంథ్రనాద్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వీటి ఆధారంగానే మేనిఫెస్టోలో నవరత్నాలను రూపొందించామన్నారు. అందుకే నీతి యోగ్ నివేదిక ప్రకారం, పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం, సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి ఎస్‌డీజీలలో ఆంధ్రప్రదేశ్ మొదటి ఐదు స్థానాల్లో ఉందని మంత్రి బుగ్గన రాజేంథ్రనాధ్ రెడ్డి తెలిపారు.