NTR Bharosa Pensions : రాష్ట్రంలో జోరుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు విడుదల..
- By Latha Suma Published Date - 11:11 AM, Tue - 31 December 24

NTR Bharosa Pensions : ఏపీలోని కుటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ మేరకు 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాని ప్రభుత్వం చేపట్టింది.
ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఉదయం 10 గంటలకు సమయానికి 53,22,406 మందికి రూ.2256 కోట్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లను జీయో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్నిఅధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని జీయో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీయో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో మరి కొద్దిసేపట్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 5,402 మందికి పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం మరింత సరళీకృతం చేసిందన్నారు. గతంలో కొత్త పింఛన్‌లను ఆరేడు నెలలకు ఒకసారి పంపిణీ చేసేవారన్నారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికామని.. రాష్ట్రంలో ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను పంపిణీ చేస్తామన్నారు. స్పౌజ్ కేటగిరిలో ఈ పింఛన్ మంజూరు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.