TTD: సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
చాలా మంది భక్తులు కాస్త ఖర్చు ఎక్కువైనా తమ సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్తుంటారు. అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..
- By News Desk Published Date - 05:58 PM, Tue - 22 April 25

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు రోజుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి, ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనంకోసం భక్తులు తిరుమలకు వస్తుంటారు. మమూలు సమయాల్లోనే తిరుమలలో ఎప్పుడూరద్దీగా ఉంటుంది.. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు టీటీడీ ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్తుంటే.. మరికొందరు సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్తున్నారు.
Also Read: Vijayasai : విజయసాయి పూర్తిగా బాబు చేతుల్లోకి వెళ్లారు – అంబటి
చాలా మంది భక్తులు కాస్త ఖర్చు ఎక్కువైనా తమ సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్తుంటారు. లేదంటే తెలిసిన వారిదో, ట్రావెల్స్ వెహికల్స్‌ను రెంట్‌కు తీసుకుని దర్శనానికి వెళ్తుంటారు. అయితే, తిరుమలకు సొంత వాహనాల్లో వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. వేసవి నేపథ్యంలో ఇటీవల తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. దీనిపై నిపుణులు ఇచ్చిన నివేదిక మేరకు భక్తులను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. సొంత వాహనాలపై తిరుమలకు వచ్చేవారికి తిరుపతి ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు కీలక సూచనలు చేశారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Also Read; Police Complaint : హెలికాప్టర్ ఎగరడం లేదని పోలీసులకు బుడ్డోడు పిర్యాదు..అసలు ట్విస్ట్ ఇదే !
ఈ జాగ్రత్తలు పాటించాలి..
◊ తిరుమలకు సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.
◊ 500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కార్లు అధికంగా వేడెక్కి ఉంటాయి. ఘాట్‌రోడ్డులో అలాగే వెళ్లడంతో ఇతర లోటుపాట్లుతోడై వాటిలో మంటలు వ్యాపిస్తున్నాయి.
◊ ఇలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రయాణానికి ముందే వాహనాన్ని యాత్రికులు సర్వీసు చేయించుకోవాలి.
◊ ఇంజిన్, కూలెంట్, బ్రేకులు, ఏసీ, ఆయిల్ తనిఖీ చేయించాలి.
◊ రేడియేటర్ లీకేజీలు గుర్తించడం, ఫ్యాన్ బెల్ట్ చూసుకోవడంతోపాటు బ్యాటరీ డిస్టిల్ వాటర్ తనిఖీ చేసుకోవాలి.
◊ వైర్ల చుట్టూ చేరిన తుప్పును తొలగించడం లాంటివి చేయించుకోవాలి.
◊ డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి.
◊ వాహనం డాష్ బోర్డ్ మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండాలి. ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే బండి ఆపి చెక్ చేసుకోవాలి.
◊ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరుమల ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలపాటు వాహనం ఆపాలి.
◊ కొండపైకి వెళ్లే క్రమంలో ఏసీ ఆఫ్ చేసుకోవడం ఉత్తమం.
◊ మొదటి ఘాట్ నుంచి కిందకు దిగే సమయంలో బ్రేకులు ఎక్కువగా వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వినియోగించాలి. న్యూట్రల్ చేయవద్దు.