Ticket Price : టికెట్ ధరల పెంపు విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్
Ticket Price : మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల ధరలపై నియంత్రణ తీసుకురావాలని సూచించారు
- Author : Sudheer
Date : 27-05-2025 - 2:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా హాళ్ల (Movie Theaters) నిర్వహణ పకడ్బందీగా సాగాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. సినిమా హాళ్లలో ఆహార పదార్థాలు, పానీయాల ధరలు, వాటి నాణ్యతపై ప్రభుత్వ శాఖలు కఠినంగా పర్యవేక్షించాలన్నారు. టికెట్ ధరలు (Ticket Price) పెంచాలన్నా, ఏ ఇతర మార్పులు చేయాలన్నా… వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఆయన తాజా చిత్రం హరిహర వీరమల్లు విషయంలో సైతం అదే నిబంధనలు పాటించాలన్న స్పష్టతనిచ్చారు.
Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ నుంచి దీపిక ఔట్.. సందీప్ ఎమోషనల్ ట్వీట్
తాజాగా సినిమా హాళ్ల బంద్ పై వచ్చిన ప్రకటనలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ బంద్ వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని, దీనికి జనసేన నాయకుడి ప్రమేయం ఉన్నా విచారణ నిలుపకూడదని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన ఈ ప్రకటన వెనుక కొందరు రాజకీయ నాయకులు, సినీ నిర్మాతల ప్రమేయం ఉందని ఉన్నత వర్గాల అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశాలు చేశారు. చిత్ర పరిశ్రమలో వ్యాపారాల కోసం బెదిరింపులు, ఒత్తిళ్లకు తావు లేకుండా న్యాయపూర్వకంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇక సినిమాలను కుటుంబ సమేతంగా ప్రేక్షకులు ఆస్వాదించాలంటే, థియేటర్లలో తినుబండారాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల ధరలపై నియంత్రణ తీసుకురావాలని సూచించారు. శుభ్రత, తాగునీటి లభ్యత వంటి మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యం మీద ఉందని, వాటిని పర్యవేక్షించేందుకు స్థానిక సంస్థలు కట్టుబడి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే ఫిలిం డెవలప్మెంట్ పాలసీకి తెలుగు చిత్ర పరిశ్రమలోని సంఘాలు, మండళ్ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు.