AP Weather: ఏపీకి తుఫాన్ ముప్పు.. డిసెంబర్ 5 వరకూ ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఏపీ వైపుగా పయనిస్తే.. కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీరంవెంబడి 45-65 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం..
- By News Desk Published Date - 04:30 PM, Wed - 29 November 23

AP Weather: దక్షిణ అండమాన్ ను ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడుతుంది వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయువ్య దిశగా కదులుతూ.. డిసెంబర్ 2వ తేదీకి తుఫాన్ గా మారుతుందని, దానికి మిచౌంగ్ గా నామకరణం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత గమనం ప్రకారం.. ఈ తుఫాను ప్రభావం ఏపీపై ఉంటుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు. ఇది దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.
ఏపీ వైపుగా పయనిస్తే.. కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీరంవెంబడి 45-65 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుఫానుగా రూపాంతరం చెందాకే ఎక్కడ తీరం దాటుతుందో అంచనా వేయగలమని వివరించారు.
డిసెంబర్ 2 నుంచి 5 వరకూ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కోనసీమ, బాపట్ల, కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. సముద్రంలో వేటకువెళ్లే మత్స్యకారులు 2వ తేదీకల్లా తీరం చేరుకోవాలని సూచించారు. ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయదిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.
Also Read : NTR District: తల్లి మందలించిందని.. పదేళ్ల బాలుడు ఆత్మహత్య