NTR District: తల్లి మందలించిందని.. పదేళ్ల బాలుడు ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజుపేటలో సిద్ధార్థ అనే బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే చిన్న తమ్ముడైన మోక్షజ్ఞతో కీచులాడుతుండగా..
- By News Desk Published Date - 04:10 PM, Wed - 29 November 23

NTR District: పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. అలాగే వారు తప్పు చేస్తే మందలించే హక్కు కూడా ఉంటుంది. పిల్లలకు మంచిచెడులు తెలిసేలా చెప్పకపోతే.. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ.. నేటితరం పిల్లల్ని చిన్న విషయంలో మందలించాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఒక్కమాటంటే చాలు.. వెంటనే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజుపేటలో సిద్ధార్థ అనే బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే చిన్న తమ్ముడైన మోక్షజ్ఞతో కీచులాడుతుండగా.. తల్లి గొడవపడకంటూ సిద్ధార్థ్ ను మందలించింది. దాంతో మనస్తాపానికి గురైన సిద్ధార్థ్ ఇంట్లో బట్టలు ఆరవేసే దండెం తాడుతో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎస్సై విజయలక్ష్మి.. సిద్ధార్థ్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కాగా.. చిన్నమాట అన్నందుకే నన్నొదిలి వెళ్లిపోయావా అంటూ ఆ తల్లి కొడుకుని గుండెలకు హత్తుకుని రోధిస్తున్న తీరు గ్రామస్తులచే కంటతడి పెట్టించింది.