Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 17-07-2026 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో భారీ కొనుగోళ్లు నమోదవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి కొనుగోళ్ల జోరు కొనసాగడంతో సూచీలు రోజంతా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. చివరకు సెన్సెక్స్ 964.58 పాయింట్లు ఎగబాకి 78,151.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 261.55 పాయింట్లు పెరిగి 24,334.30 వద్ద స్థిరపడింది.
మార్కెట్‌లో ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీ 2.12 శాతం లాభపడింది. ఐటీ సూచీ 1.75 శాతం ఎగబాకింది. రియాల్టీ సూచీ 1.34 శాతం, ఆటో సూచీ 1.24 శాతం చొప్పున పెరిగాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
నిఫ్టీ-50 సూచీలో టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, విప్రో, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయాయి.
ఏఐ కంపెనీల అధిక విలువలు, పశ్చిమాసియా భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగుతున్నా.. దేశీయ మార్కెట్ సెంటిమెంట్ నిలకడగా ఉందని నిపుణులు తెలిపారు. తొలి త్రైమాసిక ఫలితాలపై నెలకొన్న అంచనాలు, కంపెనీల వ్యాపార అప్‌డేట్లు కూడా కొనుగోళ్లకు ఊతమిచ్చాయని విశ్లేషించారు.
సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి 24,400 స్థాయి కీలక నిరోధంగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిని దాటితే సూచీ 24,500 నుంచి 24,600 స్థాయుల దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు 24,200 తక్షణ మద్దతుగా మారిందని, ఆ తర్వాత 24,000 స్థాయి కీలక సపోర్ట్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.