AP Congress : ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సార్వత్రిక ఎన్నికలపై నేడు ఢిల్లీలో సమావేశం
కర్ణాటక, తెలంగాణలో విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఏపీలో కూడా కనీస సీట్లను సాధించాలని భావిస్తుంది. ఏపీపై కాంగ్రెస్
- By Prasad Published Date - 08:26 AM, Wed - 27 December 23

కర్ణాటక, తెలంగాణలో విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఏపీలో కూడా కనీస సీట్లను సాధించాలని భావిస్తుంది. ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తాచాటెందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల సన్నాహక చర్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు (బుధవారం) ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు ఏపీ నేతలను కలుస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి కొత్తగా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణికం ఠాగూర్ హాజరుకానున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అక్రమ భూ, ఇసుక, మద్యం మాఫియా నుంచి కోట్లాది రూపాయలు వైఎస్సార్‌సీపీ నేతలకు చేరుతున్నాయని పీసీసీ చీఫ్ రుద్రరాజు ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని, ఈ మోసం ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని రుద్రరాజు ప్రశ్నించారు. జగన్ పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని మడకశిర తహశీల్దార్ వీడియో ద్వారా బట్టబయలు చేసిందన్నారు. ఇలాంటి అవినీతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదన్నారు. ఏపీసీసీ కొత్త చీఫ్‌గా వైఎస్ షర్మిల నియమితులైనట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రుద్రరాజు ఖండించారు. అయితే ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
Also Read: TDP : హిందూపురం లోక్‌సభ టికెట్ కోసం టీడీపీలో పోటీ.. సీటు కోసం అధినేత వద్దకు క్యూ..!