CM Jagan : వైసీపీలో కీలక నేతలకు షాక్ ఇచ్చిన జగన్!
వైసీపీలో కీలక నేతలకు అధినేత జగన్‌మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను సీఎం జగన్ మార్చారు....
- Author : Prasad
Date : 24-11-2022 - 9:07 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీలో కీలక నేతలకు అధినేత జగన్‌మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను సీఎం జగన్ మార్చారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌లను రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించారు. గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ హోమంత్రి సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ కు బాధ్యతలు కేటాయించారు. కుప్పం వైసీపీ అభ్యర్ధిగా ఖరారైన భరత్ ను చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను పూర్తిగా నియోజకవర్గం పైనే ఫోకస్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి అప్పగించారు.
కేబినెట్ విస్తరణలో పదవులు కోల్పోయిన అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, సుచరిత ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కీలకమైన విశాఖ జిల్లా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అప్పగించారు. పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యతలను పరీక్షిత్ రాజుకు కేటాయించారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి అప్పగించారు. కర్నూలు జిల్లా బాధ్యతను బీవై రామయ్యకు అప్పగించారు. తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తప్పించి నేదురుమల్లి రామ కుమార్ రెడ్డికి అప్పగించారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పార్టీ అనుబంధాల కో ఆర్డినేటర్ గా నియమించారు.