Srisailam : ఈ నెల 9న శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Srisailam : పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్‌లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు.
- By Latha Suma Published Date - 04:34 PM, Tue - 5 November 24

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9న శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ రానుంది. సీ ప్లేన్ సర్వీస్ కోసం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేసిన విషయం తెలిసిందే. ఇక, సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్‌లు పరిశీలించారు.
కాగా, పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్‌లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తరహాలో ఆధ్యాత్మికంగానూ, అటు పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేపట్టారు.
అయితే డీ హవిల్లాండ్ కంపెనీ రూపొందించిన 14 సీట్ల సామర్థ్యం గల సీ ప్లేన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్ ప్రయాణానికి అనువైన పరిస్థితులపై అధికారులు మొదట ఒక ప్రయోగాత్మక రన్ నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీస్ ప్రారంభించి, ఈ మార్గాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభం ద్వారా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించడంతో పాటు, శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి చేరుకోవడం మరింత సులభమవుతుందని భావిస్తున్నారు. సీ ప్లేన్ అంటే.. నీటిపై ల్యాండింగ్, టేకాఫ్ చేసే సామర్థ్యమున్న ఒక ప్రత్యేకమైన విమానం. దీని (వింగ్స్) కింద ఒక ప్రత్యేకమైన ఫ్లోట్స్ లేదా పాంటూన్స్ ఉండి, వాటి సహాయంతో నీటిపై నిలబడి ఎగరడం, దిగడం చేస్తుంది. సాధారణంగా, ఈ విమానాలను సరస్సులు, నదులు లేదా సముద్రాల్లో వాడుతూ, పర్యాటక ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి ఉపయోగిస్తారు.