Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- By Gopichand Published Date - 09:16 PM, Fri - 6 June 25

Visakha Economic Region: ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను (Visakha Economic Region) ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని.. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం.. మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగివున్న విశాఖ రీజియన్‌లో ప్రస్తుతం 49 బిలియన్ డాలర్ల జీడీడీపీ నమోదవుతోందని.. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు.
7 గ్రోత్ డ్రైవర్లు గుర్తింపు
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 6 పోర్టులు, 7 మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్‌తో విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలికవసతుల కల్పన… ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు.
Also Read: Akhil Akkineni Marries Zainab: అఖిల్ అక్కినేని వివాహం.. ఎక్స్‌లో ఫొటోలు పంచుకున్న నాగార్జున!
సాకారమైతే ఫలితాలు ఇలా
విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆస్పత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
సముద్ర తీరం- సంపద నిలయం
‘మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తాం. వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం. సముద్ర తీరం సంపద నిలయం దానిని మరింత వినియోగించుకునేలా చూడాలి. పర్యాటకాన్ని పరిశ్రమగా గుర్తించాం, నూతన పాలసీ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ – నాలెడ్జ్ ఎకానమి అవుట్ సోర్సింగ్ విధానాలు అవలంభిస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.