CM Chandrababu: వారిపై సీఎం చంద్రబాబు అంసతృప్తి.. కారణమిదే?
ఒక న్యూట్రల్ జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి ‘తుఫాను ప్రభావం ఏమీ అంత పెద్దగా లేదు’ అని పోస్ట్ చేయడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- By Gopichand Published Date - 03:06 PM, Wed - 29 October 25
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలపై ‘మోంతా’ తుఫాను ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను కొందరు సోషల్ మీడియాలో విమర్శించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ముందస్తు చర్యల పేరుతో నాయకులు ‘షో’ చేస్తున్నారని విమర్శించే వారిపై ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి, మానవ వనరుల శాఖామంత్రి వంటి నాయకులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా RTGS (రియల్-టైమ్ గవర్నెన్స్ సిస్టమ్) కేంద్రంలో సమీక్షలు నిర్వహించడాన్ని కూడా కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఇది కేవలం ‘షో’ అని పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విమర్శలు చూస్తుంటే వారు మనుషులేనా అని ప్రశ్నించాలనిపించిందని ఆయన అన్నారు.
Also Read: Montha Cyclone : మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం
అవాస్తవ పోస్టులపై ఆగ్రహం
ఒక న్యూట్రల్ జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి ‘తుఫాను ప్రభావం ఏమీ అంత పెద్దగా లేదు’ అని పోస్ట్ చేయడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఓడరేవులో 8వ నంబర్, కాకినాడ ఓడరేవులో 10వ నంబర్ ప్రమాద సూచికలు ఎగురవేసినా ఆ విమర్శకుడికి అవి కనబడలేదని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది పొంగి రోడ్లు మునిగిపోయాయనే వార్త తన ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి వింటున్నానని, పరిస్థితి తీవ్రతను ఇది తెలియజేస్తుందని ఆయన అన్నారు.
ప్రభుత్వ చర్యలకు మద్దతు
తాను దుబాయ్‌లో ఉన్నప్పటికీ అధికారులతో రివ్యూ నిర్వహించానని, హోంమంత్రి అనిత మూడు రోజుల నుండి సొంతంగా సమీక్షలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో హోంమంత్రి పేరు వైసీపీ వాళ్ళు కూడా టక్కున చెప్పలేరని విమర్శించారు. తీరప్రాంత ప్రజాప్రతినిధులు తమకు తోచిన విధంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ముందస్తు చర్యల ఆవశ్యకత
ఇప్పటివరకు వాతావరణ శాఖ తీవ్ర తుఫానుగా హెచ్చరించిందని, అదృష్టం బాగుండి తక్కువ నష్టంతో బయటపడితే మంచిదేనని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఏ మాత్రం తప్పుకాదని, రివ్యూ చేయకపోతే చేయలేదంటారని, రాత్రి 10 గంటల దాకా కష్టపడితే షో చేస్తున్నారని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు.
వ్యక్తిగత కక్ష సాధింపులు తగదు
కొందరు ఓడిపోయాడనే కడుపు మంటతో ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ద్వేషిస్తే, వారు మనుషులమని అనిపించుకోవడానికి కూడా అర్హత ఉండదని చంద్రబాబు నాయుడు గట్టిగా బదులిచ్చారు. చివరగా, మోంతా తుఫాను నుండి అతి తక్కువ నష్టంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. “అందరూ బాగుండాలి- అందులో నేనుండాలి” అని ఆకాంక్షిస్తూ తన పోస్ట్ ముగించారు.