Montha Cyclone : మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం
Montha Cyclone : మొంథా తుఫాన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వానలతో నదులు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు అడ్డంకులు ఎదురవుతున్నాయి
- By Sudheer Published Date - 02:58 PM, Wed - 29 October 25
మొంథా తుఫాన్ (Montha Cyclone) కారణంగా ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. తుఫాన్ దెబ్బకు వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడటంతో రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగిపోవడంతో ప్రజలు తమ నివాసాలు వదిలి పునరావాస కేంద్రాలకు చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. మొంథా సైక్లోన్ స్పెషల్ స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్ కింద ప్రతి పునరావాస కేంద్రంలో ఉన్న కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ విడుదల చేశారు.
Montha Cyclone Effect : చిరుగుటాకులా వణుకుతున్న ఏపీ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేస్తూ బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తుఫాన్ తీవ్రతను సీఎం పరిశీలిస్తున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ప్రయాణించి అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో దిగనున్నారు. తరువాత రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ వరదలతో మునిగిపోయిన పంట పొలాలు, గృహాలు, గ్రామాల్లో ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకునే యోచనలో ఉన్నారు.
మొంథా తుఫాన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వానలతో నదులు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాద ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వారికి ఆహారం, తాగే నీరు, వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అదనంగా ప్రకటించిన ఆర్థిక సాయం బాధితులకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు రక్షణ చర్యలు నిరంతరం కొనసాగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.