TDP : తిరువూరు, పోలవరం నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష.. నాయకులకు అధినేత క్లాస్..?
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు. రాబోయే
- Author : Prasad
Date : 06-07-2023 - 5:04 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టెందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో అధినేత చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంతనూతలపాడు, తిరువూరు, పోలవరం, సూళ్లూరుపేట నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ రోజు (గురువారం) మరో మూడు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సర్వే రిపోర్టులు, పార్టీ వ్యూహకర్తల సలహాలు, ప్రస్తుత సమాచారం ఆధారంగా అభ్యర్థుల బలం, క్యాలిబర్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈసారి ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో బలమైన అనుబంధం ఉన్న అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు.
సర్వేల్లో పనితీరు బాగాలేని ఇంఛార్జ్‌లకు ఉద్వాసన తప్పదని అధినేత హెచ్చరించారు. ఎంతటి స్థాయి నాయకుడికైనా పని తీరు బాగుంటేనే టికెట్ ఇస్తానని తెలిపారు. తిరువూరు నియోజకవర్గంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. వరుసగా నాలుగు పర్యాయాలు నుంచి పార్టీ ఘోర ఓటమి పాలవుతుంది. మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌ని తప్పించి కొత్తగా శావల దేవదత్‌ని ఇంఛార్జ్‌గా నియమించినప్పటికి పార్టీ బలపడలేదని అధినేతకు సర్వేలు వెళ్లాయి. దీంతో ఆయన ఇంఛార్జ్‌కు, నేతలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఐదోసారి కూడా సీటు ఓడిపోతే సహించేది లేదని నేతలకు తేల్చి చెప్పారు. దేవదత్ పనితీరు రోజురోజుకు పడిపోతుందని.. అందరిని కలుపుకుని పోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని హెచ్చరించారు. ఫైనల్‌గా సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తానని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
ఇటు పోలవరం నియోజకవర్గంలో ఇంఛార్జ్ బొరగం శ్రీనివాస్‌కు, మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ వర్గాలుగా విడిపోయాయి. వర్గాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతం చేయాలని అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సర్వేల్లో ప్రజల మద్దతు ఉన్నవారికే టికెట్ ఇస్తానని చంద్రబాబు తెలిపారు. ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గత ఆరు నెలలుగా పలు నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా పరిష్కరించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.