బీజేపీ చక్రంలో చంద్రబాబు..జగన్ కు టీడీపీ బూచి
ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయ పార్టీలతో మైండ్ గేమ్ ను ప్రారంభించారు.
- By Hashtag U Published Date - 04:01 PM, Tue - 26 October 21

ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయ పార్టీలతో మైండ్ గేమ్ ను ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీయేలో వైసీపీని ఏదో ఒక విధంగా భాగస్వామ్యం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం 2014 ఎన్నికలకు ముందు ఏ విధమైన గేమ్ ను మోడీ, షా ద్వయం ఆడిందో ఇంచుమించుగా అలాంటిదే ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఆనాటి గేమ్ లో బీజేపీతో కలిసి కెళ్లిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు.
సీన్ కట్ చేస్తే..2019 ఎన్నికలకు ముందు జగన్ వేసిన ప్రత్యేకహోదా పాచిక దెబ్బకు చంద్రబాబు బీజేపీ పెద్దలపై తిరగబడాల్సిన పరిస్థితి ఆనాడు ఏర్పడింది. ఆ పరిణామమే చంద్రబాబును 2019లో ఘోరంగా ఓడిపోవడానికి కారణం అయింది. ఇప్పుడు మళ్లీ 2014 ఎన్నికలకు ముందు ఆడిన గేమ్ ను బీజేపీ పెద్దలు ఆడుతున్నారు. ఎన్డీయేలోకి ఎవరు ముందు వస్తే వాళ్లదే అవకాశం అన్నట్టు అటు జగన్ ఇటు చంద్రబాబుతో రాజకీయ క్రీడను రక్తికట్టిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఆడిన గేమ్ లో బకరా అయిన చంద్రబాబు, ఇప్పుడు అదే పద్దతిలో జగన్ ను బకరా చేయడానికి ఢిల్లీ చక్రం తిప్పుతున్నాడు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీయేలో భాగస్వామ్యం కావడానికి చంద్రబాబు తహతహలాడుతున్నాడు. కేవలం ముగ్గురు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు మాత్రమే చంద్రబాబుకు పార్లమెంట్ వేదికగా ఉన్నారు. కానీ, జగన్మోహన్ రెడ్డికి 22 మంది ఎంపీలు, సుమారు 8మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఉభయ సభల్లోనూ వైసీపీకి ఉన్న బలం బీజేపీకి అవసరం. రాబోయే రోజుల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండాలంటే వైసీపీ ఎన్టీయేలో కలవడం మంచిదని బీజేపీ లెక్క.
కానీ, జగన్మోహన్ రెడ్డి ఎన్టీయేలో భాగస్వామ్యం కాకుండా బయట నుంచి మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంశాలవారీ మద్ధతు ఇస్తున్న జగన్ మీద ఇప్పటి వరకు పెద్దగా బీజేపీకి వ్యతిరేక భావం లేదు. అయినప్పటికీ ఎన్టీయే బలాన్ని 2024 సాధారణ ఎన్నికలకు ముందే ప్రదర్శించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా వైసీపీని భాగస్వామ్యం చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించడంలేదు. అందుకే, ఇప్పుడు చంద్రబాబును బూచిగా చూపి జగన్మోహన్ రెడ్డికి గాలం వేయాలని బీజేపీ పెద్దలు వ్యూహాన్ని రచించారని ఢిల్లీ వర్గాల వినికిడి.
ఆనాడు 2014 ఎన్నికల సమయంలో టీడీపీని భాగస్వామ్యం చేసుకోవడానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు చాలా కష్టపడిని విషయం విదితమే. చివరకు జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించి టీడీపీ, జనసేన పార్టీని భాగస్వామ్యం చేసుకోగలిగింది. ఇప్పుడు పవన్ బీజేపీతో ఉన్నప్పటికీ ఆ పార్టీని విలీనం చేయాలనే ఒత్తిడి ఆయన మీద తరచూ ఉంటోంది. అందుకే, ఎన్టీయే నుంచి బయటకు రావడానికి ఇటీవల జనసేనాని ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
ఆ విషయాన్ని పసిగట్టిన టీడీపీ రాష్ట్రంలో జనసేన పార్టీతో పొత్తు దిశగా అడుగులు వేసింది. బీజేపీని కూడా కలుపుకుని పోతే, 2014 మాదిరిగా అధికారంలోకి రావచ్చని చంద్రబాబు ఎత్తుగడ. అందుకోసం బీజేపీ పెద్దలతో మాటామంతీ కలపడానికి ఇటీవల టీడీపీ కబురు పంపిందని టాక్. అదే నిజం అయితే, అమిత్ షా, చంద్రబాబు భేటీ ఖాయం కానుంది.
రెండు వైపులా పదునైన రాజకీయ కత్తులను సిద్దం చేసుకున్న బీజేపీ మాత్రం…టీడీపీ బదులుగా వైసీపీకి ప్రత్యామ్నాయం కావాలని ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీని విలీనం చేసుకోవడం ఒక కోణం. బీజేపీ బాధ్యతలను పవన్ కల్యాణ్ కు అప్పగించడం ద్వారా టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్లాలని రెండో కోణం. జనసేన, టీడీపీ పొత్తు దిశగా అడుగులు వేయడం ఇష్టంలేని బీజేపీ పెద్దలు వైసీపీని మరింత బలోపేతం చేయాలనే మూడో కోణంగా ఎంచుకుంది. ఈ మూడు కోణాల్లో బెటర్ ఆప్షన్ కోసం చూస్తోన్న బీజేపీ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడని టాక్.
జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీ పెద్దలు ఆగ్రహిస్తే ఏనాడైన జగన్ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. ఒక వేళ అదే జరిగితే, వైసీపీ నామరూపాల్లేకుండా పోయే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోవడానికి అవకాశం ఉండాలంటే, ముందుగానే ఆ రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం అవసరం. లేదంటే, బీజేపీ మీద జగన్ అభిమానులు, అనుచరులు ఆగ్రహిస్తారు. అప్పుడు వ్రతం చెడినా..ఫలితంగా దక్కదన్నట్టు జగన్ ను జైలుకు పంపినప్పటికీ బీజేపీకి వచ్చే రాజకీయ లాభం ఏమీ ఉండదు. పైగా టీడీపీ అనూహ్యంగా లాభపడే అవకాశం లేకపోలేదు. ఎన్టీయేలోకి వైసీపీ వెళ్లకపోతే…ప్లాన్ బీ బీజేపీ పెద్దలకు ఉంది. అదే..టీడీపీ, జనసేన,బీజేపీ కలిసి 2024 మాదిరిగా ఎన్నికలకు వెళ్లడం. అందులో భాగంగా చంద్రబాబును కూడా రెడీగా ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. జగన్ కంటే ముందుగా చంద్రబాబునాయుడు ఎన్టీయేలోకి వెళ్లడానికి పలు మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నాడని పార్టీ వర్గాల్లోని చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏమి తేల్చుకుని వస్తాడో..చూద్దాం
Related News

Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజధాని రైతులతో నారా భువనేశ్వరి
ఏపీకి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి