CBN & KCR : ‘చంద్రుల’ మధ్య గ్రహణం వీడనుందా?
గురు శిష్యులు చంద్రబాబు, కేసీఆర్ మళ్లీ ఒకటవుతున్నారా? ఢిల్లీ చక్రం తిప్పడానికి ఇద్దరు చంద్రులు చేతులు కలిపారా?
- By CS Rao Published Date - 03:32 PM, Mon - 14 February 22

గురు శిష్యులు చంద్రబాబు, కేసీఆర్ మళ్లీ ఒకటవుతున్నారా? ఢిల్లీ చక్రం తిప్పడానికి ఇద్దరు చంద్రులు చేతులు కలిపారా? తెలుగోడి రాజకీయ పౌరుషం ఏంటో రుచిచూపించబోతున్నారా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలు తీసుకుంటే ఔనని భావించాల్సి వస్తోంది. మోడీ సర్కార్ పై 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఏ విధంగా తిరగబడ్డాడో..అలాగే ఇప్పుడు కేసీఆర్ రాజకీయ అడుగులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడుతున్నాడు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కుంభకోణాన్ని ఢిల్లీ కేంద్రంగా విడమరచి చెప్పడానికి సిద్ధం అయ్యాడు. ఆనాడు చంద్రబాబు ధర్మయుద్ధం అంటూ మోడీపై సభలను పెట్టాడు. ఇప్పుడు మోడీ సర్కార్ ను గద్దె దించడానికి జనగామ్, భువనగిరి నుంచి కేసీఆర్ శ్రీకారం చుట్టాడు. ఆ సందర్భంగా నిర్వహించిన సభలను గమనిస్తే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నిర్వహించిన మోడీ వ్యతిరేక సభలను తలపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్ మీద వ్యతిరేకత ఉందని సర్వేల సారాంశం. వాటిని గమనించిన చంద్రబాబు బీజేపీకి దూరంగా ఉంటున్నాడు. ఆ మధ్య మోడీ సర్కార్ తో చేతులు కలపాలని ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా దూరంగా ఉండాలని నిర్ణయించకున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. అంతేకాదు, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో ఏర్పడిన మైత్రిని కొనసాగించాలని యోచిస్తుందట. కాంగ్రెస్, టీడీపీ పొత్తును కొనసాగించడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు కూడా ఖరారు కానుందని టాక్. ఆ కోణం నుంచి చంద్రబాబు పావులు కదుపుతున్నాడని ఢిల్లీ వర్గాల సమాచారం. అదే, జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పొత్తు బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తుందని పీకే సర్వే సారాంశమట.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. పైగా రాఫెల్ యుద్ధ విమానల కొనుగోలుపై పార్లమెంట్లో పోరాడిని కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచేలా ఢిల్లీ కేంద్రంగా కుంభకోణాన్ని విడమరచి చెబుతానంటూ కేసీఆర్ అంటున్నాడు. రాహుల్ గాంధీ పుట్టుక గురించి మాట్లాడిన అస్సాం సీఎం హిమంత్ శర్మపై విరుచుకు పడ్డాడు.ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా చేసిన ఆందోళనకు పరోక్షంగా సహకారం అందించాడని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు మీద ఎలాంటి కామెంట్స్ కేసీఆర్ చేయడంలేదు. పైగా ఆయన్ను కొన్ని సందర్భాల్లో కేటీఆర్ ప్రశంసించాడు. మంత్రి హరీశ్ , ఎమ్మెల్సీ కవిత కూడా చంద్రబాబు గురించి పాజిటివ్ దృక్పదంతో స్పందించారు. అటు కేసీఆర్ ఇటు చంద్రబాబుకు అత్యంత క్లోజ్ గా ఉండే ఓ మంత్రి ఇటీవల చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసినట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు, కేసీఆర్ కీలక భేటీ జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయా రాష్ట్రాల ఫలితాలు ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు ఖారారు కానుందని తెలుస్తోంది. అందుకు చంద్రబాబు మధ్య వర్తిత్వం చేసేలా ప్లాన్ జరుగుతోందని ప్రచారం . కాంగ్రెస్ పార్టీతో నేరుగా ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ సీనియర్లతోనూ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఈసారి తెలంగాణలో కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీకి చోటు లేకుండా చేయాలనే మాస్టర్ స్కెచ్ వేసినట్టు వినికిడి. అందుకే, కేసీఆర్ స్వరంలో పూర్తిగా మార్పు ఇటీవల కనిపిస్తోంది. ఈసారి సరికొత్త ఎత్తుగడ ఉందని కేసీఆర్ చెబుతోన్న మాటల వెనుక ఇదేనంటూ కొందరు అనుకోవడం రాజకీయ వర్గాల్లో నూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. పైగా కేసీఆర్ ను రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశసించడం కూడా అందుకు సంకేతమంటూ ఉదహరిస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా మలుపులు ఉంటాయో..ఊహించడం కష్టం. కానీ, ఏదైనా రాజకీయల్లో సాధ్యం. సో.వెయిట్ అండ్ సీ!