పల్నాడు, కృష్ణా జిల్లా.. కలెక్టర్లకు చంద్రబాబు అభినందన
- Author : Vamsi Chowdary Korata
Date : 02-01-2026 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
AP CM Chandrababu Naidu : నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపిన పల్నాడు, కృష్ణా జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాకు అధికారులు పుస్తకాలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించగా, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచన మేరకు బాలికల వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. ఈ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
- ఇద్దరు కలెక్టర్లకు చంద్రబాబు అభినందన
- న్యూ ఇయర్ రోజు వినూత్న ఆలోచన చేశారు
- విద్యార్థులకు ఉపయోగపడేలా అద్భుతో ఆలోచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు జిల్లా కలెక్టర్లను అభినందించారు. న్యూ ఇయర్ రోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్, కృష్ణా జిల్లా కలెక్టర్లు చేసిన వినూత్న ఆలోచన బావుందని ప్రశంసించారు. ‘నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడేలా మలిచిన కృష్ణ జిల్లా, పల్నాడు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. పలు జిల్లాలలో జిల్లా కలెక్టర్లు ఇలా వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేశారు.
పల్నాడు జిల్లా కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ కృతికా శుక్లాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలిసి.. నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, డిక్షనరీలు, పెద్ద బాలశిక్ష వంటి పుస్తకాలను అందజేశారు. బొకేలు, శాలువాల బదులు ఇలా.. మొత్తం 1300 నోట్ బుక్స్, 275 ఇతర పుస్తకాలను అందించారు. ఈ వినూత్న ఆలోచనతో పుస్తకాలు తీసుకొచ్చి ఇవ్వడంపై కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పుస్తకాలను వసతిగృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, అలాగే గ్రంథాలయానికి కానుకగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కూడా వినూత్నంగా ఆలోచించారు. న్యూ ఇయర్ రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, స్వీట్స్, శాలువాల వంటి అనవసర ఖర్చులు తగ్గించాలని కలెక్టర్ సూచించారు.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనవసర ఖర్చులు చేయకుండా, ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఇటీవల సూచించారు. ఈ సూచనను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అధికారులు, సిబ్బంది తమ వంతుగా ఈ సహాయాన్ని అందించారు. గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ఈ వస్తువులను సమకూర్చారు.
ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని బాలికల సంక్షేమ వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. జిల్లాలో వివిధ శాఖ అధికారులు ఈ సాయాన్ని అందించారు. కలెక్టర్ డీకే బాలాజీకి 48 ఇన్సినరేటర్లు, 972 చిన్న బల్లలను హాస్టళ్ల కోసం అందజేశారు. ఈ ఇన్సినరేటర్లు, అంటే వాడిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా కాల్చివేసే యంత్రాలు, బాలికల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఇన్సినరేటర్ విలువ సుమారు రూ.12,500. వీటితో పాటు విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా చిన్న బల్లలను కూడా అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు.